71 దిశగా రూపాయి పయనం?

31 Aug, 2018 00:39 IST|Sakshi

డాలర్‌ మారకంలో  మరో 15 పైసలు పతనం

70.74 వద్ద ముగింపు

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. గురువారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ బుధవారంతో పోల్చితే 15 పైసలు బలహీనపడింది. 70.74 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒక దశలో 70.90ని సైతం తాకింది. ఈ రెండూ రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. బుధవారం రూపాయి 70.59 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 70.65ని చూసింది. అయితే గురువారం మరింత కనిష్ట స్థాయిలకు పడిపోయింది.  

►అమెరికా పటిష్ట వృద్ధి ధోరణి ‘డాలర్‌ బలోపేతం’ అంచనాలను పటిష్టం చేసింది. మున్ముందు డాలర్‌ మరింత పెరుగుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. దీనితో చమురు దిగుమతిదారుల నుంచి ‘నెలాంతపు’ డాలర్ల డిమాండ్‌ తీవ్రమయ్యింది. దీనితో రూపాయి భారీ పతనం అనివార్యమయ్యింది.  
►గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 70.64 వద్ద ప్రారంభమయ్యింది.  
►వివిధ దేశాలకు సంబంధించి క్రాస్‌ కరెన్సీలో కూడా రూపాయి బలహీనపడింది. బ్రిటన్‌ పౌండ్‌లో రూపాయి విలువ 90.98 నుంచి 92.07కు పడిపోయింది. యూరోలో 82.34 నుంచి 82.69కి దిగింది. జపాన్‌ యన్‌లో మాత్రం స్థిరంగా 63.46 వద్ద ఉంది.   

ఎగుమతిదారుల్లో అనిశ్చితి... 
రూపాయి విలువలో స్థిరత్వం అవసరం. ఇలా లేకపోతే ప్రత్యేకించి ఎగుమతిదారుల్లో అనిశ్చితి నెలకొంటుంది. గ్లోబల్‌ మార్కెట్‌లో వస్తువుల అమ్మకాలకు ఏ స్థాయి  ధర నిర్ణయించాలన్న అంశంపై సంక్లిష్టత నెలకొంటుంది 
– గణేష్‌ కుమార్‌ గుప్తా, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్‌ 
 

మరిన్ని వార్తలు