కంటెంట్‌పై బాధ్యత వాటిదే

18 Oct, 2017 10:01 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: డిజిటల్‌ ప్రపంచంపై గూగుల్‌, ఫేస్‌బుక్‌లు బలమైన ముద్ర వేశాయని, ఇతర మీడియా సంస్థల మాదిరిగానే వారి ఫ్లాట్‌ఫామ్‌లపై కంటెంట్‌ విషయంలో అవి పూర్తిగా జవాబుదారీగా ఉండాలని డబ్ల్యూపీపీ వ్యవస్థాపకులు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్టిన్‌ సోరెల్‌ చెప్పారు.సాంకేతిక మార్పులకు దీటుగా చట్టాలు వాటిని అందుకోలేకపోతున్నాయని భారత్‌ పర్యటనకు వచ్చిన సోరెల్‌ పేర్కొన్నారు. సంప్రదాయ మీడియాపై ఉన్న నియంత్రణ, ఫేస్‌బుక్‌ బ్లాగ్‌లపై కొరవడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

టెక్నాలజీ కంపెనీలు తాము మీడియా సంస్థలన్న సంగతి గుర్తెరిగి, అందుకు అనుగుణంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఫేస్‌బుక్‌ ఇప్పటికే తన ఎడిటోరియల్‌ కంటెంట్‌ను పర్యవేక్షించేందుకు 4000 మందిని నియమించుకుందని చెప్పారు. సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాను సక్రమంగా ఉపయోగించుకుని ప్రభుత్వాలు ప్రజలకు చేరువ కావచ్చని సూచించారు. జీఎస్‌టీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన సోషల్‌ మీడియా వేదికల ద్వారా చేపట్టవచ్చన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికలతో పాటు బ్రెగ్జిట్‌లో సోషల్‌ మీడియా చురుకైన పాత్ర పోషించిందని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు