ఇంటి రుణం ముందే తీర్చేస్తారా?

12 Nov, 2018 01:38 IST|Sakshi

చాలా వరకూ పన్ను ప్రయోజనాలుంటాయ్‌

ముందుగా చెల్లించేస్తే వీటిని కోల్పోవాల్సిందే

పన్ను ఆదా కంటే చెల్లించే వడ్డీయే ఎక్కువుండొచ్చు

అలాంటి వారు ముందే తీర్చేసే ఆలోచన చేయొచ్చు  

అందుకోసం మిగులు నిధులుంటేనే వాడుకోవాలి

కాల వ్యవధి కంటే ముందుగా చెల్లిస్తే లాభమే

కానీ ఉన్నదంతా ఊడ్చి కట్టేస్తే మళ్లీ అప్పులు తప్పవు

అలాంటి వారికి ఇలా చెల్లించటం లాభదాయకం కాదు

వడ్డీ రేట్లు పెరిగితే ఈఎంఐ మొత్తాన్ని పెంచుకోవాలి

వడ్డీ రేట్లు తగ్గిస్తే ఈఎంఐల సంఖ్యను తగ్గించుకోవాలి

కిరణ్, వాణి దంపతులు 2008లో తొలిసారి హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్నారు.  అందుకోసం 20 ఏళ్ల కాలానికి రూ.25 లక్షల రుణాన్ని తీసుకున్నారు. కానీ, నాలుగేళ్లలోనే ఆ రుణాన్ని తీర్చేయాలనుకున్నారు. అనుకున్న ప్రణాళికకు కట్టుబడ్డారు.  ఏటా వచ్చే బోనస్, ఇన్సెంటివ్, ప్రతి నెలా మిగిలే మొత్తాన్ని ఈ రుణం తీర్చేయడానికి ఉపయోగించారు. అలా ముందే రుణాన్ని తీర్చేయటం ద్వారా రూ.21 లక్షల వడ్డీని ఆదా చేసుకున్నారు.

నిజానికి వీళ్లు అనుసరించినది ప్రత్యేకమైన విధానమేమీ కాదు. చాలామంది చేసేదే. కాకపోతే అనుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండటం ద్వారా ఆ లక్ష్యాన్ని ఈజీగా చేరుకున్నారు. ఇంటి రుణాన్ని ముందుగా తీర్చేయటమన్నది కొందరికి లాభదాయకం కావచ్చు. పన్ను పరిధిలో ఉన్న వారు ఇంటి రుణాన్ని కొనసాగించాలా లేక ముందుగానే తీర్చివేయాలా? అన్న సందేహం రావచ్చు. అయితే, ఎవరికి ఏ విధానం అన్నది వారి ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది.  

అందరికీ పెద్ద మొత్తంలో బోనస్‌ రాకపోవచ్చు. క్రమం తప్పకుండా, ప్రతి నెలా ఈఎంఐకు అదనంగా చెల్లిస్తూ పోవచ్చు. 2008లో కిరణ్‌ దంపతుల ఉమ్మడి ఆదాయం రూ.14 లక్షలకు పైమాటే. వారు చెన్నైలో తాము నివాసం ఉండే ఫ్లాట్‌కు రూ.22,000 అద్దె చెల్లించేవారు. అదే సమయంలో హైదరాబాద్‌ ఇంటి కోసం తీసుకున్న రుణానికి ప్రతినెలా రూ.21,000 చెల్లించేలా ఏర్పాటు చేసుకున్నారు. 

వీరి నెలసరి ఖర్చు రూ.50 వేలు. దీంతో ఎక్కువ మిగులు ఉండేది. దాంతో హైదరాబాద్‌లో మరో ప్రాపర్టీ కూడా కొన్నారు. దీనికి పొదుపు నిధులను వినియోగించారు. తమకు ఓ ప్లాట్‌ ఉంటే దాన్ని అమ్మేశారు. ఇపుడు వీరి పెట్టుబడులపై ప్రతి నెలా రూ.40,000 అద్దె వస్తోంది. ఏక మొత్తంలో చేతికందే నిధులను ముందస్తుగా చెల్లించేందుకు వాడుకోవటమన్నది ముఖ్యం.

నోయిడాకు చెందిన అమర్‌దీప్‌ సైతం ఇంటి రుణం తీసుకోగా... ముందస్తుగా చెల్లింపులు చేస్తూ రూ.33 లక్షల రుణాన్ని స్వల్ప కాలంలోనే రూ.18 లక్షలకు తగ్గించుకున్నాడు. 2016లో తనకు బకాయిల రూపంలో రెండు విడతల్లో మొత్తం రూ.15 లక్షలు చేతికి అందడంతో, వాటిని ఇంటి రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగించాడు. రూ.50 లక్షల ఇంటి రుణం, 20 ఏళ్ల కాల వ్యవధి, 9 శాతం వడ్డీకి తీసుకోగా, అదనపు చెల్లింపులు చేస్తూ 9.3 సంవత్సరాల్లోనే రుణం మొత్తం తీర్చేశాడు. ప్రతీ 12 ఈఎంఐలకు ఓసారి రూ.3 లక్షలు అదనంగా చెల్లించాడు. ఈ విధంగా అవకాశం లేనప్పుడు... గతంలో చేసిన పెట్టుబడుల కాల వ్యవధి తీరిపోతే వాటితో ముందుగానే రుణాన్ని తీర్చేయవచ్చు.   

ఈఎంఐ పెంచుకోవచ్చు కూడా...
పొదుపు నిధుల్లేనివారు, అదే సమయంలో ఇంటి కోసం తీసుకున్న రుణాన్ని ముందుగానే వదిలించుకోవాలన్న ఆలోచనతో ఉన్నవారి ముందున్న మార్గాల్లో... ఈఎంఐ మొత్తాన్ని పెంచుతూ చెల్లించడం ఒకటి. ‘‘రూ.50 లక్షల రుణాన్ని 9% వడ్డీ రేటుపై 20 ఏళ్ల కాలానికి తీసుకుంటే... ఏటా ఈఎంఐ మొత్తాన్ని 15 శాతం పెంచి చెల్లించినట్టయితే రుణం 97 నెలల్లోనే తీరిపోతుంది. అంటే ఎనిమిదేళ్ల ఒక నెలలోనే రుణం పూర్తయిపోతుంది’’ అని మార్ట్‌గేజ్‌ వరల్డ్‌  వ్యవస్థాపకుడు పటేల్‌ చెప్పారు.

ఈఎంఐ మొత్తాన్ని 10–15% పెంచి చెల్లించడం వల్ల వడ్డీ రేట్లు పెరిగితే రుణ కాల వ్యవధి పెంచుకోవాల్సిన ఇబ్బంది కూడా ఎదురుకాదు. ‘‘వడ్డీ రేట్లు పెరుగుతుంటే కాల వ్యవధిని పెంచుకోవద్దు. దీనికి బదులు ఈఎంఐను పెంచుకోవాలి. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గితే ఈఎంఐను తగ్గించుకోవడానికి బదులు రుణ కాల వ్యవధిని తగ్గించుకోవాలి. దీనివల్ల రుణాన్ని తొందరగా ముగించేయవచ్చు’’ అని ఫిన్‌పీస్‌ టెక్నాలజీస్‌ సహ వ్యవస్థాపకుడు  రెవారియా సూచించారు.


పన్ను అంశాలూ పరిగణనలోకి..
ఇంటి రుణం తీసుకున్న కొందరు పన్ను ఆదా కోసం పూర్తి కాల వ్యవధి పాటు కొనసాగిస్తుంటారు. సెక్షన్‌ 80సీ కింద ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులకు రూ.2 లక్షలు, అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే ఈ పన్ను ఆదా అంశంపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

వడ్డీ వ్యయాల కంటే ఆదా చేసే పన్ను తక్కువగా ఉంటుంది కనక,. పన్ను ఆదా కోసం ఇంటి రుణాన్ని ముందుగా చెల్లించకుండా ఉండటం పొరపాటు అవుతుందనేది కొందరు నిపుణుల మాట. మిగులు నిధులను కాకుండా అవసరం కోసం ఉంచుకున్న కొద్ది నిధులు, పెట్టుబడులు అన్నింటినీ ముందుగా రుణ చెల్లింపునకు ఖాళీ చేసేసే వారు... దానికన్నా ముందు ఓ సారి ఆలోచించాల్సిందే. చేతిలో చిల్లిగవ్వ లేకుండా రుణాన్ని తీర్చివేస్తే... మళ్లీ డబ్బులతో పని పడితే అధిక వ్యయాలపై రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మరిన్ని వార్తలు