ఇంటి రుణం... ఇలా సులభం

23 Nov, 2015 01:15 IST|Sakshi
ఇంటి రుణం... ఇలా సులభం

మీరు గృహ రుణం తీసుకుంటున్నారా? అయితే పలు పత్రాలు, వివరాలు అందజేయక తప్పదు. వీటి ఆధారంగానే సదరు సంస్థ... రుణం తీసుకునే వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోగలుగుతుంది. అటుపై మళ్లీ ముఖాముఖిగా మీతో భేటీ అవుతుంది. దీన్నే సాధారణంగా పర్సనల్ డిస్కషన్ అంటుంటారు. ఈ డిస్కషన్ చాలా కీలకమైనది. రుణం మంజూరవుతుందా... లేదా? ఎంత మొత్తం లభిస్తుంది? మొదలైన అంశాలన్నీ ఇందులో చర్చకు వస్తాయి. అత్యంత ప్రాధాన్యమున్న పర్సనల్ డిస్కషన్ ప్రధాన ఉద్దేశంపై అవగాహన కల్పించేదే ఈ కథనం.
 
కచ్చితమైన ఆదాయాన్ని మదింపు చేయడం..
సాధారణంగా రుణదాత  సంస్థకు (లెండరు) ఇచ్చే స్టేట్‌మెంట్స్‌లో మీ ఆదాయ వివరాలున్నప్పటికీ... రుణ చెల్లింపునకు ఉపయోగపడేలా ఇతరత్రా ఆదాయ మార్గాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి ఈ డిస్కషన్ తోడ్పడుతుంది. మీ స్టేట్‌మెంట్స్‌లో ప్రతిబింబించని డిపాజిట్లు, ఇతరత్రా ఆర్థిక సాధనాలు మొదలైనవి ఏవైనా ఉంటే ఈ సమావేశం ద్వారా తెలుసుకుని, తదనుగుణంగా మీ కచ్చితమైన ఆదాయాన్ని మదింపు చేసే వీలుంటుంది.
 
మీ ఆస్తుల నికర విలువను అంచనా వేయడం..
మీకేవైనా ఆస్తులు ఉంటే ఆ వివరాలు, వాటి విషయంలో మీ ప్రణాళికల గురించి రుణ దాత అడగవచ్చు. ఒకవేళ రెగ్యులర్‌గా వచ్చే ఆదాయానికి ఏదైనా అవాంతరం ఏర్పడినా... రుణాన్ని తిరిగి చెల్లించేందుకు తగిన ఆర్థిక స్థోమత ఉందా లేదా అన్నది నిర్ధారించుకోవడమే ఈ ప్రశ్నల లక్ష్యం.
 
మీ వ్యాపార స్వభావం గురించి తెలుసుకోవడం
స్వయం ఉపాధి పొందుతున్న వారి ఆదాయాలు ఒకోసారి హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. అటువంటి వారి వ్యాపారాల స్వభావం, ఎదురయ్యే ఒత్తిళ్లు మొదలైన వాటి గురించి లెండరు తెలుసుకుంటారు. వీటిని బట్టి నిలకడగా నెలవారీ వాయిదాలు చెల్లించగలరా లేదా అన్న దానిపై నిర్ధారణకు వస్తారు.
 
వ్యయాలు అంచనా వేయడం..
ఒక్కొక్కరికీ ఒక్కో జీవన విధానం.. దానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. కనుక మీ ఖర్చుల తీరుతెన్నుల గురించి తెలుసుకున్న మీదట మీరు నెలవారీ వాయిదా ఎంత మేర చెల్లించగలరన్నది లెండరు అంచనా వేస్తారు. అలాగే, మీరు ఇతరత్రా రుణాలేమైనా ఇప్పటికే చెల్లిస్తున్న పక్షంలో మీరు కొత్తగా గృహ రుణం తీసుకుంటే అది మరింత భారం అవుతుందా లేక మీరు సమర్థంగా చెల్లించగలుగుతారా లేదా అన్నది కూడా చూస్తారు.
 
భవిష్యత్ అవకాశాలు..
మీరు ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా భవిష్యత్‌లో వృద్ధి అవకాశాల గురించి లెండరు తెలుసుకుంటారు. మం జూరయ్యే రుణ మొత్తంతో పాటు భవిష్యత్‌లో నెలవారీ చెల్లించాల్సిన వాయిదా మొత్తాన్ని పెంచుకునే అవకాశాలు దీని వల్ల మదింపు చేయడానికి వీలవుతుంది.  

పర్సనల్ డిస్కషన్‌ను ఎదుర్కొనేందుకు భారీగా కసరత్తు చేయాల్సిన అవసరమేమీ లేదు. అయితే, కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుంటే మంచిది. అవేంటంటే..
 
నిజాయితీగా వివరాలు చెప్పండి
మిగతా అన్ని చోట్లలాగే గృహ రుణం ఇచ్చే లెండరు దగ్గరా నిజాయితీగా వివరాలు చెప్పడం మంచిది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సమాచారమంతా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో అన్ని విషయాలు ఉన్నవి ఉన్నట్లుగా లెండరుకు వివరించడం మంచిది. అబద్ధం చెప్పినట్లు గానీ, ఏవైనా కీలక విషయాలు చెప్పకుండా దాచిపెట్టినట్లు గానీ తేలితే అది రుణ మంజూరీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
 
అన్ని పత్రాలు దగ్గరుంచుకోండి...

లెండరు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలతో పాటు అవసరమైన పత్రాలు అన్నీ అందించిన పక్షంలో రుణ మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతుంది.
 
ధీమాగా ఉండండి..
చిట్టచివరిగా చెప్పేదేమిటంటే.. ఈ ప్రక్రియ గురించి కంగారు, ఆందోళన చెందనవసరం లేదు. ధీమాగా వ్యవహరించండి. రుణం తీసుకోవాలంటే ఒక కస్టమరుగా.. మీకు మార్కెట్లో బోలెడన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీ ఆర్థిక స్థితిగతుల గురించిన వివరాలను స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో వివరించడమే.

- అనిల్ కొత్తూరి
సీఈవో,ఎడెల్వీజ్ హౌసింగ్ ఫైనాన్స్

మరిన్ని వార్తలు