హౌసింగ్‌ కంపెనీలకు చౌక ఇళ్ల బొనాంజా!

24 Aug, 2018 01:17 IST|Sakshi

ఈ విభాగంలో రుణాలకు  కేంద్రం వడ్డీ రాయితీ

నాలుగు వర్గాలకు  భిన్నస్థాయిలో సబ్సిడీ

దీంతో ముందుకొస్తున్న కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ,  దీవాన్‌ హౌసింగ్‌ అధిక వృద్ధి

న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో గృహాలు (అఫర్డబుల్‌ హౌసింగ్‌) రాజకీయ నేతలకు ఓట్లు కురిపించినట్టే... ఇళ్ల కొనుగోలుకు రుణాలిచ్చే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకూ భారీ వ్యాపార అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలపై కనిపిస్తోంది. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీలు ఈ విభాగంలోనే 20 శాతం వృద్ధిని ఈ ఏడాది నమోదు చేయడం గమనార్హం.  

ఈ విభాగాలపై కంపెనీల దృష్టి 
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌), తక్కువ ఆదాయ వర్గాలు (ఎల్‌ఐజీ), మధ్య ఆదాయ వర్గాలు (ఎంఐజీ–1), మధ్య ఆదాయంలోనే రెండో గ్రూపు (ఎంఐజీ–2) ఉన్నాయి. వీటిలో చివరి రెండు గ్రూపుల నుంచి హౌసింగ్‌ రుణాల కోసం డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. ఎంఐజీ–1 విభాగంలో వార్షికంగా రూ.6–12 లక్షల ఆదాయం కలిగిన వారికి వడ్డీ రేటులో 4 శాతం సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. రుణం ఎంతన్న దానితో సంబంధం లేకుండా... రుణంలో రూ.9 లక్షలపై వడ్డీకి మాత్రమే దీన్ని ఆఫర్‌ చేస్తోంది. ఇక రూ.12–18 లక్షల ఆదాయం కలిగిన లబ్ధిదారులకు రూ.12 లక్షల రుణంపై వడ్డీకి 3 శాతం రాయితీ అమల్లో ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ వర్గాలకూ గృహ రుణాల్లో వడ్డీ రాయితీని కేంద్రం అందిస్తోంది. ఈడబ్ల్యూఎస్‌ గ్రూపులో రూ.3 లక్షల వరకూ ఆదాయం కలిగిన వారు, ఎల్‌ఐజీలో రూ.3–6 లక్షల ఆదాయం కలిగిన వారు వడ్డీలో 6.5 సబ్సిడీకి అర్హులు. పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు రూ.20–40 లక్షల గృహ రుణాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం గమనార్హం.  

మధ్యస్థ ధరల ఇళ్లకు డిమాండ్‌ 
రూ.6–12 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారు తొలిసారి ఇల్లు కొనుగోలుకు రుణం తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. వీరు తీసుకునే రుణం కూడా తమ వార్షికాదాయానికి మూడు రెట్ల మేర అంటే రూ.18–35 లక్షల మధ్య ఉంటోంది. రూ.25–40 లక్షల విలువ కలిగిన ఇళ్ల కొనుగోలుకు వీరు రుణాల బాట పడుతున్నారు. కొన్ని పట్టణాల్లో, పెద్ద పట్టణాలకు శివార్లలో మధ్య తరహా ఇళ్లకు డిమాండ్‌ ఉంటోందని ఆంటిక్యూ బ్రోకింగ్‌ అనలిస్ట్‌ దిగంత్‌ హారియా చెప్పారు. ‘‘రూ.10–20 లక్షల మధ్య ఇళ్లకు ఇంకా డిమాండ్‌ పుంజుకోలేదు. రెరా, నోట్ల రద్దు, సరఫరా తక్కువగా ఉండటం వల్ల ఈ విభాగం బంగారం వంటిది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ 37 శాతం రుణాలను ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో, 19 శాతం రుణాలను ఎల్‌ఐజీ విభాగంలోనే ఆమోదించడం గమనార్హం. నెలవారీగా హెచ్‌డీఎఫ్‌సీ ఈ రెండు విభాగాలకు సంబంధించి 8.300 రుణ దరఖాస్తులను ఆమోదిస్తోంది. నెలవారీగా ఆమోదించే సగటు రుణాల విలువ రూ.1,346 కోట్లుగా ఉంది. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ అయితే అందుబాటు గృహాలపై దృష్టి సారించడం ద్వారా 28 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఈ సంస్థ కస్టమర్లలో 65 శాతం మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే. తమ కస్టమర్లలో 35 శాతం మంది ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద వడ్డీ రాయితీకి అర్హులేనని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వీసీ గగన్‌బంగా తెలిపారు.    

మరిన్ని వార్తలు