అమ్మకాల్లో అదరగొడుతున్న హోండా అమేజ్

15 Jun, 2016 13:17 IST|Sakshi

న్యూఢిల్లీ : కాంపాక్ట్ సెడాన్ లోకి దూసుకొచ్చిన హోండా అమేజ్ కారు అమ్మకాల్లో అదరహో అనిపిస్తోంది. దేశీయ మార్కెట్లో 2 లక్షల అమ్మకాల మైలురాయిని హోండా అమేజ్ చేధించింది. 2013 ఏప్రిల్ లో ఈ కారును భారత మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ కారుతో భారత డీజిల్ విభాగంలోకి హోండా ప్రవేశించింది. మూడేళ్ల వ్యవధిలో ఈ కారు 2లక్షల యూనిట్ల అమ్మకాలతో మైలురాయిని తాకాయని, కొత్త కస్టమర్లను ఎక్కువగా ఈ కారు ఆకట్టుకుంటోందని హోండా కార్ల ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్, సేల్స్ అధినేత జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. చిన్న, పెద్ద రెండు పట్టణాల్లో హోండా అమేజ్ బాగా పాపులర్ అయిందని పేర్కొన్నారు.

ఈ కాంపాక్ట్ సెడాన్ అప్ గ్రేడెడ్ వెర్షన్ ను వివిధ రకాల ఫీచర్స్ తో మార్చిలో కంపెనీ ప్రవేశపెట్టింది. కంటిన్యూగా వేరియబుల్ ట్రాన్సిమిషన్(సీవీటీ) కలిగి ఉండటం ఈ అప్ డేట్ ప్రధాన ఫీచర్. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ సామర్థ్యాలు ఈ కారు కలిగి ఉంది. భద్రతపై ఎక్కువగా దృష్టిసారించిన హోండా అప్ గ్రేడెడ్ వెర్షన్ లో డ్యూయల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ ను ఈ కారులో పొందుపరిచింది. భవిష్యత్తులో అన్ని హోండా కార్లు డ్యూయల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ తోనే వస్తాయని కంపెనీ పేర్కొంది. సీవీటీ ఆప్షన్ ను ఆఫర్ చేసే మొదటి పెట్రోల్ కాంపాక్ట్ సెడాన్ ఈ కొత్త అమేజ్ నే. దీనివల్ల మంచి ఇంధన సామర్థ్యాన్ని అమేజ్ కలిగి ఉంటోంది. ఈ కారు ధర రూ.5.41లక్షల నుంచి రూ.8.31లక్షల(ఎక్స్ షోరూం ఢిల్లీ) మధ్య ఉంటోంది.  

మరిన్ని వార్తలు