హోండా కార్ల ధరలు పెంపు!

9 Jul, 2018 18:27 IST|Sakshi
హోండా కార్ల ధరలు పెంపు (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్‌ ఇండియా తన మోడల్స్‌పై ధరలను పెంచింది. వచ్చే నెల నుంచి తన మోడల్స్‌పై 35 వేల రూపాయల వరకు ధరలు పెరగనున్నట్టు హోండా కార్స్‌ ప్రకటించింది. ఇన్‌పుట్‌ కాస్ట్‌లు పెరగడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 10 వేల రూపాయల నుంచి 35 వేల రూపాయల వరకు ధరలను పెంచాలని కంపెనీ ప్లాన్‌ చేస్తుందని, ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌(హెచ్‌సీఐఎల్‌) ప్రకటించింది. ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడం, గత కొన్ని నెలలుగా కస్టమ్స్ డ్యూటీల ప్రభావం, ఎక్కువ ఫ్రైట్‌ రేట్లు వంటివి తమ కార్ల ధరలను పెంచేలా ప్రభావితం చేశాయని హెచ్‌సీఐఎల్ సేల్స్‌, మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ గోయల్‌ చెప్పారు. 

ఇటీవల లాంచ్‌ చేసిన కొత్త అమేజ్‌ ధరను కూడా ఆగస్టు నుంచి సమీక్షించనున్నట్టు పేర్కొన్నారు. హెచ్‌సీఐఎల్‌ తన మోడల్స్‌ హ్యాచ్‌బ్యాక్‌ బ్రియోను ప్రారంభ ధర రూ.4.73 లక్షలకు అందిస్తుండగా..  అకార్డు హైబ్రిడ్‌ను రూ.43.21 లక్షలకు విక్రయిస్తోంది. ఈ రేంజ్‌లో హోండా కార్లు మార్కెట్‌లో ఉన్నాయి. ఏప్రిల్‌లో లగ్జరీ కారు తయారీదారులు ఆడి, జేఎల్‌ఆర్‌, మెర్సిడెస్‌ బెంజ్‌లు కూడా లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో ధరలను పెంచాయి. కస్టమ్‌ డ్యూటీలు పెరగడంతో, తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. హ్యుందాయ్‌ మోటార్స్‌ కూడా జూన్‌ నుంచి 2 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. ఇలా కార్ల సంస్థలు తమ మోడల్స్‌పై ధరల పెంపును ప్రకటిస్తున్నాయి. 

>
మరిన్ని వార్తలు