హోండా బహుముఖ వ్యూహం

10 Jun, 2016 00:27 IST|Sakshi
హోండా బహుముఖ వ్యూహం

హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్
కొత్త మోడల్స్ విడుదల; ఉత్పత్తి పెంపుపై దృష్టి... లోకలైజేషన్‌కు ప్రాధాన్యం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :డిమాండ్‌కి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త మోడల్స్, నెట్‌వర్క్ విస్తరణతో కొనుగోలుదారులకు మరింత చేరువవుతున్నామంటున్నారు ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్. లోకలైజేషన్‌పై దృష్టి సారించడం ద్వారా నాణ్యమైన కార్లను తక్కువ ధరకు అందించే ప్రయత్నం చేస్తున్నామంటూ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు సేన్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

 భారీ మార్కెట్...
సుమారు 120 కోట్ల మంది పైగా జనాభా గల మన దేశంలో ప్రస్తుతం కార్ల మార్కెట్ కేవలం ముప్పై లక్షల మేర ఉంటోంది. సంపన్న దేశాల్లో వెయ్యి మందికి ఆరేడు వందలు, పొరుగు దేశాల్లో దాదాపు వంద కార్లుగాను నిష్పత్తి ఉంటే.. మన దగ్గర ఇది ఇరవై కార్ల కన్నా తక్కువగానే ఉంది. కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులకు అనుగుణంగా ఈ మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. అదే అంచనాలతో మేమూ మా ఉత్పత్తి సామర్ధ్యాలను పెంచుకుంటున్నాం. ఎప్పటికప్పుడు కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాం. ప్రస్తుతం ఏడు మోడల్స్ విక్రయిస్తున్నాం. సీఆర్-వీ సహా ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నవే. దిగుమతి చేయడం లేదు. తదుపరి వృద్ధిని అందుకునే దిశగా మేము సన్నద్ధమవుతున్నాం.  ఏప్రిల్, మేలో అమ్మకాలు కాస్త మందగించాయి. ప్రధానంగా డీజిల్, పెట్రోల్ కార్ల విషయంలో కొనుగోలుదారుల అభిరుచులు మారడం, డిమాండ్-సరఫరాకి మధ్య వ్యత్యాసాలు మొదలైనవి ఇందుకు కారణం. మరికొద్ది కాలంలో ఇది సర్దుకోవచ్చు.

 విక్రయాల వృద్ధికి వ్యూహాలు..
కొనుగోలుదారులకు మరింత చేరువయ్యే దిశగా కొత్త మోడల్స్ ప్రవేశపెట్టడం, స్థానికంగా తయారీకి ప్రాధాన్యం ఇవ్వడం, ఉత్పత్తి పెంచుకోవడం తదితర వ్యూహాలను అమలు చేస్తున్నాం. ప్రస్తుతం 190 నగరాల్లో సుమారు 298 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. వీటిని ఈ ఆర్థిక సంవత్సరం 340కి పెంచుకోనున్నాం.  కార్ల మార్కెట్లో దాదాపు మూడో వంతు రీప్లేస్‌మెంట్‌దే ఉంటున్న నేపథ్యంలో పాత కార్ల ఎక్స్చేంజీ ఆఫర్లు కూడా ఇస్తున్నాం. అలాగే లోకలైజేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. మా వాహనాల్లో గరిష్టంగా భారత్‌లో తయారైన విడిభాగాలే ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకు ఇటీవలే ప్రవేశపెట్టిన బీఆర్-వీనే తీసుకుంటే..

ఇది 94 శాతం భాగం దేశీయంగానే తయారైనది. దీనికి సుమారు నెల రోజుల వ్యవధిలో దాదాపు తొమ్మిది వేల పైచిలుకు ఆర్డర్లు వచ్చాయి. ఇక, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ఎక్కువగా స్థానీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దిగుమతి వ్యయాలు తగ్గడం వల్ల తక్కువ ధరల రూపంలో ఆ ప్రయోజనాలను కొనుగోలుదారులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఉత్పత్తికి సంబంధించి రాజస్తాన్‌లోని టపుకరాలో 1.2 లక్షల వార్షిక సామర్థ్యం గల ప్లాంటు ఉంది. అక్కడ సామర్థ్యాన్ని 1.8 లక్షలకు పెంచుకునే దిశగా రూ. 380 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. గ్రేటర్ నోయిడాలోని మరో ప్లాంటుతో కూడా కలుపుకుంటే విస్తరణతో మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.4 లక్షల నుంచి 3 లక్షలకు పెరుగుతుంది.

 కొత్త సెగ్మెంట్లలోకి..
మేం వివిధ విభాగాల్లో కాస్త ఆలస్యంగానే ప్రవేశించినప్పటికీ..  నాణ్యతే ప్రధానంగా ముందుకెడుతున్నాం. గత మూడేళ్లుగా ఎంట్రీ లెవెల్ సెడాన్, ఎంపీవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. ఇవన్నీ మా అమ్మకాల వృద్ధికి దోహదపడ్డాయి.  ఈ ఏడాది హోండా అకార్డ్ (హైబ్రీడ్) సెప్టెంబర్‌లో ప్రవేశపెడుతున్నాం. దీన్ని మాత్రం దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తాం. హైబ్రీడ్ కార్ల మార్కెట్ చిన్నగానే ఉన్నప్పటికీ.. పర్యావరణంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఇది మెరుగుపడవచ్చు.

 విధానాల్లో స్పష్టత కొరవడింది...
సవాళ్ల విషయానికొస్తే.. విధానాల్లో స్పష్టత లేకపోవడం సమస్యలకు దారితీస్తోంది. పరిశ్రమల శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు దీని ప్రభావాల గురించి వివరించింది. ప్రస్తుతానికైతే ఢిల్లీలోనే ఇది అమలవుతోంది. డీజిల్ వాహనాలపై ఆంక్షలు కొనుగోలుదారుల్లో ఆలోచనల్లో కొంత అనిశ్చితికి దారి తీశాయి.. ఇది మాకూ కొంత సమస్యాత్మకంగా మారింది. కొనుగోలుదారులు డీజిల్ నుంచి పెట్రోల్ కార్లవైపు మళ్లుతుండటంతో దానికి తగ్గట్లుగా ఉత్పత్తినీ సర్దుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాం.

దక్షిణాది మార్కెట్.. రయ్ రయ్
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది మార్కెట్ చాలా వేగంగా పరుగులు తీస్తోంది. అయిదేళ్ల క్రితం ఉత్తరాది ముందువరుసలో ఉంటే, పశ్చిమ, దక్షిణాది రీజియన్లు వరుసగా రెండు, మూడో స్థానంలో ఉండేవి. కానీ ప్రస్తుతం మూడూ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. బహుశా మరో ఒకట్రెండు సంవత్సరాల్లో దక్షిణాది జోన్ ముందుకు వచ్చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. కరీంనగర్, వరంగల్ మొదలుకుని ఏపీలో వైజాగ్, విజయవాడ, నెల్లూరు తదితర ప్రాంతాల్లో మా డీలర్‌షిప్‌లు ఉన్నాయి. కొత్తగా నల్లగొండలో ప్రారంభిస్తున్నాం.

మరిన్ని వార్తలు