ప్రీమియం బ్రాండ్‌గానే కొనసాగుతాం..

27 May, 2017 03:43 IST|Sakshi
ప్రీమియం బ్రాండ్‌గానే కొనసాగుతాం..

పరిశ్రమ కంటే అధిక వృద్ధి నమోదు చేస్తాం
హోండా కార్స్‌ ఇండియా సీఈవో యొయిచిరో


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ కార్ల మార్కెట్లో ప్రీమియం బ్రాండ్‌గానే కొనసాగుతామని హోండా కార్స్‌ ఇండియా తెలిపింది. మోడళ్ల నాణ్యత, అమ్మకాలు, సర్వీస్‌ పరంగా ప్రీమియం బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో యొయిచిరో ఒయినో శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఎంట్రీ లెవెల్లో కూడా ఈ ఇమేజ్‌ను కొనసాగిస్తామని చెప్పారు. బ్రియో కంటే చిన్న కారును తెచ్చే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. విదేశాల్లో ప్రస్తుతం లభిస్తున్న కాంపాక్ట్‌ ఎస్‌యూవీ హెచ్‌ఆర్‌–వి, ప్రీమియం సెడాన్‌ అయిన సివిక్‌తోపాటు మరో ఎస్‌యూవీని భారత్‌లో ప్రవేశపెట్టే అంశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మోడళ్లు 2018–19లోనే ఎంట్రీ ఇస్తాయని కంపెనీ మార్కెటింగ్‌ ఏవీపీ రాకేశ్‌ సిడన తెలిపారు.

2020 నుంచి మొదలు..
భారత్‌లో 2020–30 మధ్య కాలంలో కార్ల మార్కెట్‌ కొత్త శిఖరాలను చేరుకుంటుందని యొయిచిరో తెలిపారు. ‘2020 నాటికి చైనా, యూఎస్‌ తర్వాతి స్థానాన్ని భారత్‌ కైవసం చేసుకుంటుంది. 2017–18లో పరిశ్రమ 7–8 శాతం వృద్ధి నమోదు చేయనుంది. పరిశ్రమ కంటే మెరుగైన వృద్ధిని హోండా ఆశిస్తోంది. ఇటీవల భారత్‌లో హోండా విడుదల చేసిన కొత్త సిటీ 30,000లకుపైగా, కొత్త డబ్లు్యఆర్‌–వి 16,000లకుపైగా బుకింగ్స్‌ నమోదయ్యాయి. ఈ రెండు మోడళ్లు తోడవడంతో ఏప్రిల్‌లో 38 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం 345 షోరూంలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా 22 నగరాల్లో అడుగు పెట్టి మరో 29 ఔట్‌లెట్లు ఏర్పాటు చేయనున్నాం’ అని వివరించారు.

ఎలక్ట్రిక్‌ కార్లకు..
దేశంలో ఎలక్ట్రిక్‌ కార్లు పెద్ద ఎత్తున పరుగెత్తడానికి మరింత సమయం పడుతుందని యొయిచిరో వెల్ల డించారు. తమ కంపెనీ ఎలక్ట్రిక్‌ కార్లను అభివృద్ధి చేస్తోందని, అయితే భారత మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనేదీ ఇప్పుడు చేయడం లేదని చెప్పారు. ఈ కార్లు తిరగడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇక్కడి మార్కెట్లో లేవని గుర్తు చేశారు. పైగా సాధారణ కార్లతో పోలిస్తే వీటి ఖరీదు రెండింతలు ఉండడం కూడా పెద్ద అడ్డంకి అని స్పష్టం చేశారు. ఇంత ధర వెచ్చించేందుకు కస్టమర్లు సిద్ధంగా లేరని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు