హోండా ప్లాంట్‌ నిరవధిక మూసివేత

12 Nov, 2019 11:27 IST|Sakshi


హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) హర్యానా, మానేసర్‌లోని తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు  విఫలం కావడంతో సంస్థ ఈ  నిర్ణయం తీసుకంది.  సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు  సంస్థ  నోటీసు విడుదల చేసింది. 

యూనియన్ నాయకులు, ప్లాంట్ మేనేజ్‌మెంట్ మధ్య సోమవారం చర్చలు జరిగినా సఫలం కాలేదు. దీంతో శాశ్వత కార్మికులు, సంఘాలు, ఇతర కాంట్రాక్ట్ సిబ్బందిపై దుష్ప్రవర్తన ఆరోపణలు గుప్పిస్తూ ప్లాంట్ హెడ్ సైబల్ మైత్రా ఈ నోటీసులిచ్చారు. యూనియన్ నేతలు కాంట్రాక్టు కార్మికులను రెచ్చగొట్టి తమ అక్రమ సమ్మెను కొనసాగించమని పదేపదే కోరడంతోపాటు,  కంపెనీ ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా నిరసనలకు ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలోఉంచుకుని, ప్లాంట్ సాధారణ కార్యకలాపాలు సాధ్యం కాదని భావించి నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించేదీ స్పష్టం చేయలేదు. అయితే ప్లాంట్‌లోని పరిస్థితి సాధారణమైన తర్వాత కార్యకలాపాల పునఃప్రారంభంపై వాటాదారులకు  సమాచారం ఇస్తామన్నారు. 

కాగా ఉత్పత్తి కోత, కాంట్రాక్టు ఉద్యోగులపై భారీగా తొలగించడంపై నవంబర్ 5 నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. అలాగే తమకు జీతాలు పెంచాలని కూడా పర్మినెంట్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. వీరి ఆందోళనకు రాజకీయ పార్టీలు, ఇతర యూనియన్లు మద్దతు ఇస్తున్నాయి. ప్లాంట్ కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ రమేష్ ప్రధాన్ సమాచారం ప్రకారం, ప్లాంట్లో ఉత్పత్తి  చేసే ద్విచక్ర వాహనాల సంఖ్య రోజుకు 6000 నుండి నవంబర్ నాటికి 3500 కు తగ్గింది. దీంతో 2019 ప్రారంభం నుండి మొత్తం 1,000 మంది ఉపాధి కోల్పోయారు. అలాగే నిబంధనల ప్రకారం, ప్రతి మూడు సంవత్సరాలకు పే స్కేల్ సవరించాలి. అయితే ఆగస్టు 2018 నుండి ఇది పెండింగ్‌లో ఉందని కార్మికులు వాదిస్తున్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా