ఫిబ్రవరిలో హనీవెల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్లు

15 Dec, 2017 02:15 IST|Sakshi

2 నెలల క్రితం బెంగళూరులో ప్రారంభం

ఇప్పుడు హైదరాబాద్‌లో 3 కేంద్రాల ఏర్పాటు

టెక్‌ స్టార్టప్స్‌లకు ప్రాధాన్యం; ఫండింగ్‌ కూడా..

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఏరోస్పేస్, ఆటోమొబైల్, ప్రాసెస్‌ ఇండస్ట్రీస్‌ టెక్నాలజీ సంస్థ హనీవెల్‌... హైదరాబాద్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 3 ఇంక్యుబేషన్‌ కేంద్రాలను ప్రారంభించనుంది. టెక్నాలజీ స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు, వ్యాపార అవకాశాలున్న స్టార్టప్స్‌ను ఎంపిక చేసి ఇన్వెస్ట్‌ చేసేందుకు ఈ కేంద్రాలను వినియోగించుకుంటామని.. 2 నెలల క్రితం బెంగళూరులో 7 స్టార్టప్స్‌ ఎంపికతో ఈ సేవలను ప్రారంభించామని హనీవెల్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అక్షయ్‌ బెల్లారీ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు.

గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... డిజిటల్‌ ఇండియా, స్మార్ట్‌ సిటీ వంటి వాటితో స్మార్ట్, కనెక్టెడ్‌ ఉత్పత్తులకు అపారమైన వ్యాపార అవకాశాలున్నాయని వీటిని అందిపుచ్చుకునేందుకు ప్రస్తుతమున్న హనీవెల్‌ ఉత్పత్తులకు సాంకేతికతను జోడించడంతో పాటూ కొత్త ఉత్పత్తులనూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భువనేశ్వర్, మధ్యప్రదేశ్‌ వంటి ప్రాంతాల్లో పలు స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌లకు హనీవెల్‌ టెక్నాలజీలను అందించామని.. మరిన్ని ప్రాజెక్ట్‌లతో ఒప్పందం చేసుకో నున్నామని తెలిపారు.

హైదరాబాద్‌లో కొత్త నియామకాలు..
అమెరికాకు చెందిన హనీవెల్‌ ఇంటర్నేషనల్‌ అనుబంధ సంస్థే హనీవెల్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, మధురై, పుణె, వడోదరాల్లో కార్యాలయాలున్నాయి. ఏరోస్పేస్, హోమ్‌ అండ్‌ బిల్డింగ్‌ టెక్నాలజీ (హెచ్‌బీటీ), సేఫ్టీ అండ్‌ ప్రొడక్టివిటీ సొల్యూషన్స్‌ (ఎస్‌పీఎస్‌), పర్ఫామెన్స్‌ మెటీరియల్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ నాలుగు బిజినెస్‌ యూనిట్స్‌ ఉన్నాయి. దేశంలో 15 వేల మంది ఉద్యోగులుండగా.. ఇందులో 7 వేల మంది మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే. హైదరాబాద్‌ సెంటర్‌లో 1,200 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే మరికొంత మందిని నియమించుకోనున్నట్లు అక్షయ్‌ తెలియజేశారు.

మరిన్ని వార్తలు