థర్మల్ విద్యుత్‌కు బొగ్గు సరఫరాపై కోటి ఆశలు

23 Aug, 2014 03:18 IST|Sakshi
థర్మల్ విద్యుత్‌కు బొగ్గు సరఫరాపై కోటి ఆశలు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలో ఏర్పాటైన ప్రతి  థర్మల్ విద్యుత్కేంద్రానికి అవసరాలకు తగ్గ బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రతిపాదన వెంటనే అమల్లోకి వస్తే తక్షణమే 7,230 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. మరో 10,930 మె.వా. విద్యుదుత్పత్తి వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా సిద్దమవుతుంది. తాజా ప్రతిపాదన పట్ల ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్కేంద్ర నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రతిపాదన ప్రకారం  ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ప్రాజెక్టులకే కాక కొత్తగా ఏప్రిల్ 2017 వరకు ఏర్పాటయ్యే థర్మల్ విద్యుత్కేంద్రాలకు కూడా ఇది వర్తించేలా చర్యలు చేపట్టనున్నారు. ఆయా ప్రాజెక్టులు చేసుకున్న ఇంధన ఒప్పందాలతో సంబంధం లేకుండా అన్ని యూనిట్లకు  బొగ్గు సరఫరా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.  కేంద్ర ఇంధన మంత్రిత్వ  శాఖ అంచనా ప్రకారం దేశంలో 12 వేల మె.వా. సామర్థ్యంకల ప్లాంట్లకు ఇంధన ఒప్పందాలు లేవు. దీంతో ఏటా రూ. 32 వేల కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లుతోంది.  క్యాప్టివ్ కోల్‌మైన్స్ లెసైన్స్ ఉండి ఏ కారణం చేతనైనా అది రద్దయినా, ఆలస్యమైనా అలాంటి ప్రాజెక్టులకు కూడా ఈ పథకాన్ని విస్తరించనున్నారు.

 ఈ ప్రతిపాదనపై  ‘‘థర్మల్ విద్యుత్కేంద్రాలకు అవసరమైనంత బొగ్గు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను స్వాగతిస్తున్నాం. మా అనుబంధ సంస్థ గాయత్రీ ఎనర్జీ వెంచర్స్ ద్వారా 2,640 మె.వా. థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాం. నిరంతర బొగ్గు సరఫరా హామీ ఉంటే సామర్థ్యాన్ని మరింత పెంచే ఆలోచన చేసే అవకాశం ఉంది. అయితే దేశీయంగా లభించే బొగ్గు కేలరీ నాణ్యత విషయం కొంత ఆందోళనకరం. ఏదేమైనా బొగ్గు సరఫరా ప్రతిపాదన దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి ఊతాన్నిస్తుంది’’ అని  సందీప్ రెడ్డి, గాయత్రీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అభిప్రాయపడ్డారు.

 ‘‘నిరంతర బొగ్గు సరఫరా హామీ అమలైతే 100 మె.వా.లోపు థర్మల్ యూనిట్లకు ఆక్సిజన్ ఇచ్చిన ట్లవుతుంది. క్యాప్టివ్ యూనిట్లకే కాక కోజనరేషన్ యూనిట్లకు కూడా పూర్తి స్థాయి సామర్థ్యాన్ని అందుకొనే వీలుంటుంది. అయితే అంతర్జాతీయ, దేశీయ కోల్ ధరల్లో పెద్ద వ్యత్యాసమేమీ లేదు. నాణ్యమైన బొగ్గు సరఫరా చేస్తే ఉత్పత్తి మరింత నాణ్యంగా అందించవచ్చు’’ అని హరి కుమార్, సింహాద్రి పవర్ తెలిపారు.

మరిన్ని వార్తలు