పండుగల నాటికి సివిక్‌ రీ–ఎంట్రీ

23 May, 2018 00:36 IST|Sakshi

అప్‌గ్రేడెడ్‌ సీఆర్‌–వీ కూడా విడుదల

హోండా కార్స్‌ ఎస్‌వీపీ రాజేశ్‌ గోయల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కార్ల తయారీ సంస్థ హోండా కార్స్‌ ఇండియా నుంచి ప్రీమియం సెడాన్‌ ‘సివిక్‌’ రీ–ఎంట్రీ ఇవ్వబోతోంది. 2013లో ఈ మోడల్‌ కార్ల అమ్మకాలను కంపెనీ నిలిపివేసింది. 55,000లకు పైగా సివిక్‌ కార్లు భారత రోడ్లపై పరుగెడుతున్నాయి.

కస్టమర్ల నుంచి డిమాండ్‌ రావడంతో తిరిగి ఈ కారును ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని హోండా కార్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ గోయల్‌ మంగళవారం  పేర్కొన్నారు. ఎస్‌యూవీ అయిన సీఆర్‌–వీ అప్‌గ్రేడెడ్‌ మోడల్‌ సైతం రంగ ప్రవేశం చేయనుందని చెప్పారు. ఈ రెండు మోడళ్లు పండుగల సీజన్‌ నాటికి అడుగుపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లో కొత్త అమేజ్‌ కారును ప్రవేశపెట్టిన సందర్భంగా సౌత్‌ సేల్స్‌ హెడ్‌ సెంథిల్‌ కుమార్‌ నటరాజన్‌తో కలసి మీడియాతో మాట్లాడారు.

రెండంకెల వృద్ధి..
కంపెనీ 2017–18లో భారత్‌లో 1,70,000 పైగా కార్లను విక్రయించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 8 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ కార్ల పరిశ్రమ వృద్ధి రేటు 8 శాతం ఉండనుందని రాజేశ్‌ గోయల్‌ తెలిపారు. ‘హోండా వృద్ధి రేటు పరిశ్రమను మించి రెండంకెలు సాధిస్తుందన్న ధీమా ఉంది.

కొత్త అమేజ్‌ కోసం ఈ ఏడాది మార్చిలోపే 50,000లకు పైగా ఎంక్వైరీలు వచ్చాయి. నూతన ప్లాట్‌ఫామ్‌పైన ఈ కారును అభివృద్ధి చేశాం. ఫస్ట్‌ జనరేషన్‌ అమేజ్‌ మోడల్‌లో 2.6 లక్షల కార్లు ఇప్పటి వరకు అమ్ముడయ్యాయి. 241 నగరాల్లో 353 ఔట్‌లెట్లను నిర్వహిస్తున్నాం’ అని వివరించారు.


 

మరిన్ని వార్తలు