ఫుడ్‌ డెలివరీ యాప్స్‌పై హోటళ్ల గుస్సా!!

27 Aug, 2019 13:17 IST|Sakshi

జొమాటో, స్విగ్గీ, ఉబర్‌ ఈట్స్, ఫుడ్‌పాండా వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ అగ్రిగేటర్స్‌ భారీ డిస్కౌంట్లు ఇస్తుండటాన్ని హోటళ్ల సమాఖ్య నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) తీవ్రంగా ఖండించింది. అగ్రిగేటర్స్‌ సంస్థలు.. తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని, తక్షణమే ఈ విధానాలను మానుకోవాలని పేర్కొంది. ఎన్‌ఆర్‌ఏఐలో సభ్యత్వం ఉన్న రెస్టారెంట్లన్నీ లాగ్‌అవుట్‌ ఉద్యమాన్ని ఇతర ఆన్‌లైన్‌ డెలివరీ ప్లాట్‌ఫాంలకు కూడా విస్తరించాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ .. అగ్రిగేటర్స్‌తో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది.

స్విగీ, జొమాటో, ఉబర్‌ ఈట్స్, ఫుడ్‌పాండా సంస్థలకు వేర్వేరుగా ఎన్‌ఆర్‌ఏఐ ఈ మేరకు లేఖలు రాసింది. పారదర్శకత లోపించడం, భారీ డిస్కౌంట్లు ఇస్తుండటం, ఆన్‌లైన్‌ డెలివరీ అగ్రిగేటర్స్‌ తమ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుండటం వంటి అంశాలపై తమ సభ్యులు, అసోసియేషన్స్, ఇతర రెస్టారెంట్ల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డెలివరీ పరిశ్రమకు ఇలాంటి పరిణామాలు ఆందోళనకర విషయాలని హెచ్చరించింది. టెక్నాలజీకి తాము వ్యతిరేకం కాదని.. కాకపోతే తాజా పరిణామాలు చిన్న రెస్టారెంట్లు, స్టార్టప్‌ల మనుగడకు, ఉపాధి అవకాశాల వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్‌ అగ్రిగేటర్స్‌ భారీ డిస్కౌంట్లు ఇస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ పలు రెస్టారెంట్లు లాగ్‌అవుట్‌ ఉద్యమం పేరుతో ఆన్‌లైన్‌ యాప్స్‌ నుంచి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు