రియల్టీకి కరోనా కాటు...

25 Mar, 2020 04:13 IST|Sakshi

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గృహ నిర్మాణాలు ఆలస్యం

8–10 శాతం తగ్గనున్న నిర్మాణ సంస్థల ఆదాయం 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ రియల్టీ రంగం మీద కరోనా వైరస్‌ ప్రభావం పడింది. కోవిడ్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ఉన్న కారణంగా గృహాల అమ్మకాలు, నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని హౌజింగ్‌ బ్రోకరేజ్‌ అనరాక్‌ కన్సల్టెన్సీ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 15.62 లక్షలకు పైగా గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, ఇవి  2013–19 మధ్య కాలంలో ప్రారంభమైన గృహాలేనని నివేదిక తెలిపింది.  దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో నిర్మాణ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రాజెక్ట్‌లలో నిర్మాణ పనులు జరగడం లేదని అనరాక్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ ఠాకూర్‌ తెలిపారు. సాధారణంగా గుడిపడ్వా, అక్షయతృతీయ, నవరాత్రి, ఉగాది వంటి పర్యదినాల్లో గృహ కొనుగోళ్లు జోరుగా ఉంటాయని.. గృహ ప్రవేశాలకు ముందస్తు ప్రణాళికలు చేస్తుంటారని కానీ, కరోనా వైరస్‌ కారణంగా ఈసారి విక్రయాలు సన్నగిల్లాయని, గృహ కొనుగోలుదారులు గృహ ప్రవేశం చేసే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇది డెవలపర్ల ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తుందని తెలిపారు.

హైదరాబాద్‌లో 64,250 గృహాలు.. 
నగరాల వారీగా నిర్మాణంలో ఉన్న గృహాల సంఖ్యను చూస్తే.. హైదరాబాద్‌లో 64,250 యూనిట్లు, ఎంఎంఆర్‌లో అత్యధికంగా 4.65 లక్షల గృహాలు, ఎన్‌సీఆర్‌లో 4.25 లక్షలు, పుణేలో 2.62 లక్షలు, బెంగళూరులో 2.02 లక్షలు, కోల్‌కతాలో 90,670, చెన్నైలో 54,200 యూనిట్లు ఉన్నాయి.

8–10 శాతం ఆదాయం లాస్‌.. 
నిర్మాణ సంస్థలు ఆదాయం మీద లాక్‌డౌన్‌ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా కంపెనీల వార్షిక ఆదాయంలో నాల్గో త్రైమాసికం వాటా 30–35 శాతం వరకుంటుందని.. కానీ, ఫోర్త్‌ క్వాటర్‌లో ఆదాయం 8–10 శాతం క్షీణిస్తుందని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు