ఇంటి నిర్మాణం.. ఆలస్యమైతే అమృతం హుళక్కి!

21 Sep, 2015 03:10 IST|Sakshi
ఇంటి నిర్మాణం.. ఆలస్యమైతే అమృతం హుళక్కి!

- పెరిగే ధరల భారాన్ని భరించక తప్పదు
- జాప్యంతో పన్ను మినహాయింపుల్లోనూ కోత

ఆలస్యం.. ఆలస్యం.. ఈ పదాన్ని నిత్యం వింటూనే ఉంటాం. అనుకోని కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆలస్యం వల్లలాభం కలిగితే, మరికొన్ని పనుల్లో ఆలస్యం వల్ల నష్టం తప్పదు. మరి ఇంటి నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే..? ఆ ఇంటి కొనుగోలుదారుడిపై ఈ జాప్యం ప్రభావం ఏ మేర ఉంటుంది? ఎందుకంటే ఇళ్ల నిర్మాణంలో ఇలాంటి జాప్యాలు కొత్త కాదు. కొనుగోలుదారులు వీటిని కూడా దృష్టిలో ఉంచుకోకతప్పదు.
 
అవినాశ్ ఓ ప్రభుత్వోద్యోగి. 2011లో హైదరాబాద్ శివార్లలో ఒక ఇల్లు కొనాలనుకున్నాడు. కొందరు బిల్డర్లతో మాట్లాడాడు. వారిలో ఒక బిల్డర్ 2014 నాటికి (మూడేళ్ల కాలం) ఇంటిని కట్టిస్తామని హామీ ఇచ్చాడు. ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నారు. అంతా బాగానే ఉన్నా... మూడే ళ్ల కాలం గడిచిపోయాక కూడా ఇల్లు పూర్తికాలేదు. ఇదేంటని బిల్డర్‌ను ప్రశ్నించాడు అవినాశ్. దీంతో అతనిచ్చిన అడ్వాన్సును తిరిగి ఇచ్చేశాడు బిల్డర్. హమ్మయ్య! అనుకున్నాడు అవినాష్. కానీ అతనికిక్కడ కనిపించని తీవ్రమైన నష్టం జరిగింది. ఎందుకంటే అవినాశ్ అడ్వాన్స్ ఇచ్చినపుడు ఆ ఫ్లాట్ ధర రూ.42 లక్షలు. కానీ మూడేళ్లు గడిచి అడ్వాన్సు వెనక్కి తీసుకునే నాటికి దాని ధర రూ.57 లక్షలకు పెరిగింది. అంటే ఇప్పుడు అవినాశ్ కొత్తగా ఇంటిని కొనాలంటే అదనంగా రూ.15 లక్షలు భరించాలి. నిజానికి ఈ పరిస్థితి ఒక్క అవినాశ్‌దే కాదు. చాలా మంది ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బిల్డర్లు వారి డబ్బులను వెనక్కివ్వటం జరుగుతోంది. ఎందుకంటే పాత ధరలకిస్తే లాభాలు తగ్గుతాయని!!.
 
ఈఎంఐలపై కూడా ఇదే నష్టం...
ఒక వ్యక్తి ఇంటి కోసం ఫైనాన్స్ కంపెనీ వద్ద 9.7 శాతం వడ్డీరేటుతో 20 ఏళ్ల కాలపరిమితితో రూ.50 లక్షల రుణాన్ని తీసుకున్నాడు. అప్పుడు అతను చెల్లించే ఈఎంఐ నెలకు దాదాపుగా రూ.47,262గా ఉంటుంది. అనుకున్న సమయంలో అతను కొత్త ఇంట్లోకి చేరితే పర్వాలేదు. అలా జరగకపోతే.. అతను అప్పటికే నెలకు రూ.15,000-20,000 వరకు అద్దె చెల్లిస్తూ ఉంటాడు కదా... అప్పుడు అతను ఇటు ఈఎంఐ, అటు అద్దె చెల్లించటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆర్థికంగా పరిస్థితులు తలకిందులైపోతాయి కూడా.
 
పన్ను ప్రయోజనాలూ పోతాయి...
ఇంటిపై రుణం తీసుకున్న వారు అనుకున్న సమయానికి ఇల్లు పూర్తికాకపోతే పన్ను తగ్గింపు ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదమూ ఉంది. సాధారణంగా ఇంటి రుణం తీసుకున్న వారు ఆ మొత్తంపై కొంత వరకు (సెక్షన్ 80సీ ప్రకారం... ఏడాదికి రూ.1.5 లక్షల వరకు) పన్ను తగ్గింపును క్లెయిమ్ చేసుకోవడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. అలాగే వడ్డీ రూపంలో మొత్తంగా రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది కూడా రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం ముగిశాక... మూడేళ్ల లోపు ప్రాపర్టీని స్వాధీనం చేసుకుంటేనే. ఇలాకాని పక్షంలో వడ్డీ మొత్తంలో రూ.30,000 వరకు మాత్రమే పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు నిర్మాణ దశలో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఇంటి నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత క్లెయిమ్ పొందవచ్చు.

ఈ మొత్తాన్ని  ఇంటి నిర్మాణం పూర్తయిన సంవత్సరం నుంచి... ఐదు ఈఎంఐలలో పొందాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఆర్థిక భారాన్ని భరించాలి లేదా నిర్మాణంలో ఉన్న ఇంటిని విక్రయించాలి. చేసేదేమీ లేక చాలా మంది నిర్మాణంలో ఉన్న ఇంటిని విక్రయిస్తున్నారు. ‘ఢిల్లీ వంటి పట్టణాల్లో డబ్బు రికవరీ కోసం ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి’. అని నైట్ ఫ్రాంక్ ఇండియా రెసిడెన్షియల్ ఏజెన్సీ నేషనల్ డెరైక్టర్ ముదసిర్ జైదీ తెలిపారు. ‘భవిష్యత్తులో నిర్మాణ పనుల్లో జాప్యాల వల్ల తలెత్తే సమస్యలు, నష్టాల నుంచి రక్షణ లభించే విధంగా డెవలపర్లు ఒక ఒప్పందాన్ని రూపొందించాలి’ అని యాస్పైర్ హోమ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ అనిల్ సచిదానంద్ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు