2.2% తగ్గిన ఇళ్ల అమ్మకాలు

27 Jun, 2016 01:25 IST|Sakshi
2.2% తగ్గిన ఇళ్ల అమ్మకాలు

హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో పరిస్థితిపై జేఎల్‌ఎల్ నివేదిక
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 2.2 శాతం మేర తగ్గినట్టు ప్రాపర్టీ సలహా సేవల సంస్థ అయిన జేఎల్‌ఎల్ ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. అమ్మకాలు, ధరలు పడిపోవడంతో 2015-16లో రియల్ ఎస్టేట్ రంగం దారుణమైన పరిస్థితులను చవిచూసిందని తెలిపింది.

గత మూడు నాలుగేళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గుముఖం పట్టిందని, దాంతో ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యానికి దారితీసిందని... ఫలితంగా కొనుగోలుదారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయని వివరించింది. అయితే, వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే...  2015-16లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, పుణె నగరాల్లో గృహాల అమ్మకాలు 2.2 శాతం తగ్గాయి. మొత్తం 1,58,211 యూనిట్లు అమ్ముడుపోయాయి. అయితే, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అమ్ముడుపోయిన ఇళ్ల అమ్మకాల సంఖ్య 1,61,875తో పోలిస్తే ఇది 2.2 శాతం తక్కువ.  

కానీ, 2016 సంవత్సరంలోని మొదటి మూడు నెలల కాలంలో గృహాల అమ్మకాల్లో పెరుగుదల చోటు చేసుకోవడం భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేసింది. 2015 సంవత్సరం చివరి త్రైమాసికం లో 39,001 ఇళ్లు అమ్ముడవగా... 2016 జనవరి - మార్చి త్రైమాసికంలో 42,521 ఇళ్లు అమ్ముడుపోయాయి. దీని ప్రకారం చూస్తే ఒక్క త్రైమాసికంలోనే అమ్మకాలు 9 శాతం వృద్ధి చెందినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు