అనిశ్చితిలో రియల్టీ

19 Oct, 2019 00:01 IST|Sakshi

గృహాల సేల్స్, లాంచింగ్స్‌ రెండింట్లోనూ క్షీణత

సాక్షి, హైదరాబాద్‌: దేశీయ రియల్టీ రంగం గడ్డు పరిస్థితుల్లో కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో గృహాల అమ్మకాలు, ప్రారంభాలు రెండింట్లోనూ క్షీణత నమోదైంది. జులై – సెప్టెంబర్‌ త్రైమాసికంలో ప్రాజెక్ట్‌ల లాచింగ్స్‌ 45 శాతం, అమ్మకాల్లో 25 శాతం తగ్గాయని ప్రాప్‌ టైగర్‌ నివేదిక తెలిపింది. ఇదే ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చినా సరే ప్రారంభాల్లో 32 శాతం, విక్రయాల్లో 23 శాతం క్షీణత నమోదైందని పేర్కొంది.

6 నెలల కాలంతో పోల్చినా క్షీణతే..
2018–19 ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 170,715 గృహాలు విక్రయం కాగా.. 2019–20 ఆర్ధిక సంవత్సరం నాటికి 151,764 మాత్రమే అమ్ముడుపోయాయి. ఇక, గత ఫైనాన్షియల్‌ ఇయర్‌ తొలి అర్ధ వార్షికంలో కొత్తగా 137,146 యూనిట్లు లాంచింగ్స్‌ కాగా.. ఈ ఆర్ధికం నాటికి 83,662 యూనిట్లకు పడిపోయాయి. అంటే 6 నెలల కాలానికి చూసినా అమ్మకాల్లో 11 శాతం, లాంచింగ్స్‌లో 39 శాతం క్షీణత కనిపించింది.

ముంబై, పుణె నగరాల్లో జోష్‌..
2018–19 ఆర్ధిక సంవత్సరం జులై – సెప్టెంబర్‌లో 61,679 గృహాలు ప్రారంభం కాగా.. 2019–20 ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో 33,883 యూనిట్లు మాత్రమే లాంచింగ్స్‌ అయ్యాయి. ఇందులో 41 శాతం గృహాలు రూ.45 లక్షల లోపు ధర ఉండే అఫడబుల్‌ గృహాలే. ఈ ఫైనాన్షియల్‌ ఇయర్‌లో అత్యధికంగా యూనిట్లు ప్రారంభమైంది పుణేలోనే. ఇక్కడ 10,425 గృహాలు లాంచింగ్స్‌ అయ్యాయి. ఆ తర్వాత ముంబైలో 8,132 యూనిట్లు స్టార్ట్‌ అయ్యాయి. 2018–19 ఆర్ధికం జులై – సెప్టెంబర్‌ కాలంలో 65,799 గృహాలు అమ్ముడుపోగా.. 2019–20 నాటికి 88,078 యూనిట్లకు తగ్గాయి. ముంబైలో అత్యధికంగా 21,985 గృహాలు అమ్ముడుపోగా, పుణెలో 13,644 యూనిట్లు విక్రయమయ్యాయి.

హైదరాబాద్‌లో ధరలు 15 శాతం జంప్‌..
గతేడాదితో పోలిస్తే దేశంలో ఇన్వెంటరీ గృహాలు 13 శాతం తగ్గాయి. ప్రస్తుతం తొమ్మిది ప్రధాన నగరాల్లో ఇన్వెంటరీ 778,627లుగా ఉంది. గుర్‌గావ్, చెన్నై మినహా అన్ని నగరాల్లో స్థిరాస్తి ధరల్లో వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్‌ ధరల్లో 15 శాతం వృద్ధి కనిపించింది.

మరిన్ని వార్తలు