67 శాతం పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

11 Jul, 2020 05:52 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ కాలంలో 67 తగ్గినట్టు ప్రాప్‌ఈక్విటీ అనే సంస్థ తెలిపింది. ఈ కాలంలో 21,294 ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయినట్టు గణాంకాలను విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 64,378 యూనిట్లు (ఇళ్లు/ఫ్లాట్లు)గా ఉన్నట్టు తెలిపింది. ‘‘నోయిడాను మినహాయిస్తే మిగిలిన ఎనిమిది ప్రధాన పట్టణాల్లో అమ్మకాలు పడిపోయాయి.

గురుగ్రామ్‌లో అత్యధికంగా 79 శాతం క్షీణత నెలకొంది. కేవలం 361 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక హైదరాబాద్‌లో 74 శాతం తగ్గి 996 ఇళ్ల విక్రయాలు నమోదు కాగా, చెన్నైలోనూ ఇంతే స్థాయిలో అమ్మకాలు తగ్గాయి. బెంగళూరులో 73 శాతం, కోల్‌కతాలో 75 శాతం చొప్పున అమ్మకాలు క్షీణించాయి. ముంబైలో 63 శాతం తగ్గి కేవలం 2,818 యూనిట్లకే విక్రయాలు పరిమితమైనట్టు’’ ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. నోయిడాలో మాత్రం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాలు 5 శాతం పెరిగి 1,177 యూనిట్లుగా నమోదైనట్టు పేర్కొంది.   

మరిన్ని వార్తలు