మహమ్మారి ఎఫెక్ట్‌ : నిర్మాణ రంగం కుదేలు

2 Apr, 2020 15:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మహమ్మారి ప్రభావంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది గృహ విక్రయాలు 35 శాతం మేర తగ్గుతాయని ప్రాపర్టీ బ్రోకరేజ్‌ సంస్ధ అనరాక్‌ అంచనా వేసింది. కరోనా వైరస్‌ ప్రభావం వాణిజ్య (కార్యాలయ, రిటైల్‌) రియల్‌ఎస్టేట్‌పైనా ఉంటుందని పేర్కొంది. ప్రాపర్టీ మార్కెట్‌లో మందగమనం కొనసాగుతున్నా మెరుగైన సామర్ధ్యం కనబరుస్తున్న వాణిజ్య నిర్మాణ రంగంపై మహమ్మారి ఎఫెక్ట్‌ పడనుండటంతో మొత్తంగా నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇక 2019లో కార్యాలయ సముదాయానికి 40 మిలియన్‌ చదరపు అడుగుల స్ధలం లీజ్‌కు తీసుకోగా, ఈ ఏడాది అది 28 మిలియన్‌ చదరపు అడుగులకు పడిపోవచ్చని అనరాక్‌ అంచనా వేసింది. ఇక రిటైల్‌ రంగంలో లీజింగ్‌ సైతం ఈ ఏడాది 64 శాతం మేర పతనమవుతుందని పేర్కొంది. కోవిడ్‌-19 ప్రభావంతో దేశంలో రెసిడెన్షియల్‌ రియల్‌ఎస్టేట్‌కు డిమాండ్‌ పడిపోవడంతో పాటు లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొంటోందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌ అనుజ్‌ పూరి తెలిపారు.

రియల్‌ ఎస్టేట్‌పై కోవిడ్‌-19 ప్రభావం పేరిట వెల్లడించిన నివేదికలో నిర్మాణ రంగ కార్యకలాపాలపై కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ మహమ్మారితో నిర్మాణ రంగంలో నిస్తేజం ఆవరించిందని అనరాక్‌ పేర్కొంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సైట్‌ విజిట్లు, సంప్రదింపులు, డాక్యుమెంటేషన్‌, క్రయ, విక్రయ ప్రక్రియలు పూర్తిగా నిలిచిపోయాయని, మరో రెండు త్రైమాసికల్లో సైతం సంక్లిష్ట సమయం ఎదుర్కోవడం తప్పదని నివేదిక స్పష్టం చేసింది. సంక్షోభాన్ని అధిగమించి నిర్మాణ రంగం కుదురుకునేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని నివేదిక పేర్కొంది.

చదవండి : ‘‘డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’’

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా