గూగుల్‌ చేతికి హాలీ ల్యాబ్స్‌

14 Jul, 2017 01:37 IST|Sakshi
గూగుల్‌ చేతికి హాలీ ల్యాబ్స్‌

న్యూఢిల్లీ: సెర్చి ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ .. బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ హాలీ ల్యాబ్స్‌ను ’ఆక్వి–హైరింగ్‌’ ప్రాతిపదికన కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించారనేది వెల్లడించలేదు. భారత్‌లో గూగుల్‌ ఏదైనా సంస్థను కొనుగోలు చేయడం ఇదే ప్రథమం. భారత్‌ లాంటి వర్ధమాన దేశాల్లో కొత్త యూజర్లకి ఇంటర్నెట్‌ను చేరువ చేసేందుకు హాలీ ల్యాబ్స్‌ కొనుగోలు ఉపయోగపడనుంది.

గూగుల్‌కి చెందిన నెక్స్ట్ బిలియన్‌ యూజర్స్‌ టీమ్‌లో తాము కూడా భాగస్వాములం కావడం సంతోషంగా ఉందని హాలీ ల్యాబ్స్‌ తమ బ్లాగ్‌లో పేర్కొంది. ఏదైనా కంపెనీ అందించే ఉత్పత్తులు, సర్వీసుల కన్నా.. అందులోని సిబ్బంది కోసమే కొనుగోలు చేయడాన్ని ఆక్వి–హైరింగ్‌గా వ్యవహరిస్తారు. గూగుల్‌ ఇటీవలి కాలంలో కంపెనీల కొనుగోలు ద్వారా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో కార్యకలాపాలు విస్తరిస్తోంది.

మరిన్ని వార్తలు