డిజిటల్‌ చెల్లింపులు పెంచేది ఎలా?

9 Jan, 2019 01:30 IST|Sakshi

నందన్‌ నీలేకని నేతృత్వంలో కమిటీ

ముంబై: దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ పురోగతిపై కసరత్తు ప్రారంభమైంది. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు, ఆధార్‌ రూపశిల్పి నందన్‌ నిలేకని నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని ఆర్‌బీఐ మంగళవారం ఏర్పాటు చేసింది. తొలి సమావేశం తరువాత 90 రోజుల్లో కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. దేశంలో ప్రస్తుత డిజిటల్‌ చెల్లింపుల పరిస్థితి? ఆర్థిక వ్యవస్థలో ఇందుకు సంబంధించి లోపాలేంటి? వాటిని ఎలా అధిగమించాలి? డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ విస్త రణకు అనుసరించాల్సిన మార్గాలు? ప్రజల్లో ఈ వ్యవస్థపై విశ్వాసాన్ని ఎలా పెంపొందించాలి? అన్న అంశాలపై నిపుణుల కమిటీ దృష్టి పెడుతుంది.    

కమిటీలో ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ హెచ్‌ఆర్‌ ఖాన్,విజయాబ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈఓ కిషోర్‌ శాన్సీ, ఐటీ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన అరుణ శర్మ, సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ చీఫ్‌ ఆఫీసర్‌ సంజయ్‌ జైన్‌ సభ్యులుగా ఉంటారు. ‘ఆర్‌బీఐతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారత్, భారతీయుల కోసం చెల్లింపుల వ్యవస్థ పునరుత్తేజానికి ఆర్‌బీఐ, కమిటీలు కృషి చేస్తాయి’ అని నీలేకని ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు