ఇన్వెస్ట్‌ చేయాలా..? విక్రయించాలా..?

6 Apr, 2020 04:36 IST|Sakshi

ముందు అత్యవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆ తర్వాతే పెట్టుబడుల యోచన

మిగులు నిల్వలుంటే ఈక్విటీలకు కేటాయించుకోవాలి

2008–09 తర్వాత అత్యంత ఆకర్షణీయ విలువలు

మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ ఎంచుకోవచ్చు

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. దేశాలన్నీ ఇప్పుడు ఈ వైరస్‌ నియంత్రణ కోసమే తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలకు ‘లాక్‌’ వేసి పోరాటం సాగిస్తున్నాయి!. మన దేశంలో ఏప్రిల్‌ 14 వరకు లౌక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, సేవలు మినహా మిగిలిన పరిశ్రమలు, వ్యాపారాలన్నీ మూతబడ్డాయి. దీంతో ఎంతోమంది జీవనోపాధి అనిశ్చితిలో పడింది. ఈ పరిణామాల ప్రభావం దేశీయ స్టాక్‌ మార్కెట్లలో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రధాన సూచీలు వాటి గరిష్టాల నుంచి 35 శాతం పడిపోయాయి. విడిగా స్టాక్స్‌ను పరిశీలిస్తే 60 శాతానికి పైగా క్షీణించినవీ ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇన్వెస్టర్లను ఆత్మరక్షణలోకి నెట్టేవే. అదనంగా ఇన్వెస్ట్‌ చేయాలా..? లేక ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసేసుకోవాలా..? ఇలా ఎన్నో ప్రశ్నలు రావచ్చు. వాటికి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

భయపడక్కర్లేదు...
తమ పెట్టుబడులను సమీక్షించుకునేందుకు ఇది మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 50 సూచీ గరిష్టం నుంచి 40 శాతం వరకు పడిపోయి గత వారం కొంత రికవరీ చూపించింది. నిజానికి ఈ తరహా భారీ కరెక్షన్‌ను 2008లోనూ చూశాం. అయినా ఇన్వెస్టర్లలో చాలా మంది ఈ తరహా సంక్షోభాలకు సన్నద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో మార్కెట్ల పతనం చూసి భయపడిపోయి ఉన్న ఈక్విటీ పెట్టుబడులను అమ్మేసుకుని వెళ్లిపోవడం ఈ తరుణంలో చేయాల్సిన పని కాదంటున్నారు విశ్లేషకులు. ‘‘నగదుకు అత్యవసరం లేకపోతే ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లో తమ సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)ను, సిస్టమ్యాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ (ఎస్‌టీపీ) కొనసాగించుకోవాలి’’ అని సృజన్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకురాలు దీపాలిసేన్‌ పేర్కొన్నారు. ఈ రెండూ కొనుగోలు ఖర్చును సగటుగా మారుస్తాయని, మార్కెట్‌ కరెక్షన్‌లో మరిన్ని యూనిట్లను సమకూర్చుకోవచ్చని ఆమె సూచించారు. ఒకవేళ ఉద్యోగం కోల్పోవడం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే అప్పడు ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడాన్ని పరిశీలించొచ్చన్నారు. అది కూడా బ్యాంకు సేవింగ్స్‌ ఖాతా మొత్తం ఖాళీ అయ్యి, డెట్‌ ఫండ్స్, ఇతర నిల్వలన్నీ అడుగంటిన తర్వాతే ఈక్విటీ పెట్టుబడుల ఉపసంహరణను పరిశీలించాలని సూచించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏక మొత్తంలో పెట్టుబడులను కూడా ఈ తరుణంలో చేసుకోవచ్చని, కాకపోతే ఒకే విడత కాకుండా పలు విడతలుగా చేసుకోవాలని ప్లాన్‌రూపీ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు అమోల్‌జోషి సూచించారు.

అత్యవసరాలు చూసుకోవాలి...
ఈ సమయంలో జీవన అవసరాల కోసం నిధులు కావాల్సిన వారు ఈక్విటీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి బదులు ఈపీఎఫ్‌ బ్యాలన్స్‌ను కొంత వెనక్కి తీసుకోవడాన్ని తాను సూచిస్తానని మ్యాక్స్‌ సెక్యూర్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌ వ్యవస్థాపకుడు ప్రకాశ్‌ ప్రహరాజ్‌ తెలిపారు. ఈపీఎఫ్‌ సభ్యులు తమ భవిష్య నిధి నుంచి 75 శాతాన్ని లేదా మూడు నెలల బేసిక్‌ వేతనం, డీఏ ఈ రెండింటిలో ఏది తక్కువ మొత్తం అయితే ఆ మేరకు ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్, లౌక్‌డౌన్‌ సమీప కాలంలో వృద్ధి అవకాశాలను దెబ్బతీయగా.. దీర్ఘకాలంలో మాత్రం ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు, వైరస్‌ నివారణ చర్యలతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. ఆర్థిక వృద్ధి పట్ల ఉన్న భయాలు ఈక్విటీ మార్కెట్లను ప్రస్తుతం చౌకగా మార్చేశాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ పేర్కొంది. పీఈ, పీబీవీ, జీడీపీలో మార్కెట్‌ క్యాప్‌ కొలమానాల ఆధారంగా ఈ సంస్థ రూపొందించిన వ్యాల్యూషన్‌ ట్రాకర్‌ మార్చి 23న 72.6 స్థాయికి చేరింది. అంటే దూకుడుగా పెట్టుబడులు పెట్టుకోవచ్చన్నది దీని సంకేతం. చివరిగా ఈ స్థాయిలో వ్యాల్యూషన్‌ ట్రాకర్‌ కనిపించింది 2008–09లోనే కావడం గమనార్హం. మిగులు నిధులు కలిగిన వారు, రోజువారీ ఖర్చులకు సరిపడా పక్కన పెట్టేసి, అలాగే అత్యవసర పరిస్థితులకు కొంత కేటాయించుకున్న తర్వాత.. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల కోసం కేటాయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  అలాగే, తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు పెట్టుబడుల కేటాయింపు దోహదపడుతుందా? లేదా అని ఓ సారి సమీక్షించుకుని, అవసరమైతే మార్పులు కూడా చేసుకోవాలి.  

మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్గం..
మార్కెట్‌ నిపుణులు, విశ్లేషకులను ప్రశ్నిస్తే ఎక్కువ మంది నుంచి వచ్చే స్పందన ఈక్విటీల్లో పెట్టుబడులకు ఇది మంచి అనుకూల సమయమనే. ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాల కోసం వేచి చూసేవారు, దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారు సిప్‌ మార్గాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్స్‌ ధరల్లో దిద్దుబాటుతో అవి చాలా ఆకర్షణీయంగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెల్త్‌కేర్, టెలికం రంగాలు ప్రస్తుత పరిస్థితుల్లో రాణించగలవన్న అంచనాతో ఉన్నారు. ఇన్వెస్టర్లు ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్, ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని, వీటిల్లో లిక్విడిటీ మెరుగ్గా ఉంటుందని నిప్పన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ ఈడీ, సీఈవో సందీప్‌సిక్కా తెలిపారు. మొదటి సారి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారికి, సీజన్‌ వారీగా ఇన్వెస్ట్‌ చేసే వారికి ఇండెక్స్‌ ఫండ్స్‌ అనుకూలమైనవిగా సిక్కా పేర్కొన్నారు. యాక్టివ్‌గా నిర్వహణతో కూడిన ఫండ్స్‌తోపాటు, ఈటీఎఫ్, ఇండెక్స్‌ ఫండ్స్‌ను వ్యూహాత్మకంగా ఎంచుకోవాలన్నారు. ‘‘మార్కెట్లు రికవరీ అయినప్పుడు ముందుగా సూచీల్లోనే అది ప్రతిఫలిస్తుంది. ప్రతీ పతనం తర్వాత బలమైన రికవరీ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈటీఎఫ్‌లు చక్కని ఆప్షన్‌’’ అని సిక్కా వివరించారు.  

ఈక్విటీల్లో పెట్టుబడులు..
ప్రస్తుత తరుణంలో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించుకోవాలని, మిగులు నిధులు ఉంటే దీర్ఘకాలం కోసం క్రమంగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలని యస్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో కన్వర్‌ వివేక్‌ సూచించారు. ‘‘స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు బేర్‌ మార్కెట్లు ఎంతో అనుకూలమైనవి. మార్కెట్ల పనితీరు దారుణంగా ఉందంటే మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి మంచి రాబడులకు అవకాశం ఉన్నట్టే’’ అని ఆశికా వెల్త్‌ అడ్వైజర్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్‌జైన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న నిధుల్లో 40 శాతాన్ని ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌కు కేటాయించుకోవాలి. ఇవి 7–8 శాతం వరకు రాబడులను ఇస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను మిడ్‌క్యాప్, మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో వచ్చే ఆరు నెలల కాలంలో క్రమంగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలి’’ అని అమిత్‌జైన్‌ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హెల్త్‌కేర్‌ రంగంలోని కంపెనీలు, ముఖ్యంగా డయాగ్నస్టిక్స్‌ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయని పేర్కొన్నారు. అందరూ ఇంటికే పరిమితం కావడం, ఇంటి నుంచే పని చేస్తున్నందున డేటాకు డిమాండ్‌ భారీగా ఉంటుందని కనుక టెలికం కంపెనీలను సైతం పెట్టుబడులకు పరిశీలించొచ్చని సూచించారు. అలాగే, ఎఫ్‌ఎంసీజీ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావం తక్కువే ఉంటుందన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు