ఆధార్‌తో పాన్‌ లింక్‌ ఇలా..

2 Mar, 2020 16:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్‌-పాన్‌ లింకింగ్‌పై తాజా డెడ్‌లైన్‌ మార్చి 31లోగా అనుసంధానం చేసుకోవడంలో విఫలమైతే రూ 10,000 జరిమానా, పాన్‌ కార్డు పనిచేయదని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. కీలక పత్రాలైన ఆధార్ కార్డు, పాన్ కార్డు అనుసంధానంపై కేంద్రం ఇప్పటికే పలుమార్లు గడువు తేదీలను పొడిగించింది. ఇప్పటికీ చాలా మంది ఆధార్‌తో పాన్‌ అనుసంధానం చేయని వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. తాజా డెడ్‌లైన్‌లోగా ఈ రెండింటినీ లింక్‌ చేసుకోవాల్సి ఉండగా వీటి అనుసంధానానికి అవసరమైన దశలను చూద్దాం.

ఆధార్‌తో పాన్ లింక్ చేసుకోవడం సులభమే. అయితే కొన్ని సందర్భాల్లో రెండు అనుసంధానం కాకపోవచ్చు. ఆధార్, పాన్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉన్నా కూడా రెండు లింక్ కావు. ఆధార్ కార్డును యూఐడీఏఐ జారీ చేస్తే, పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. పాన్, ఆధార్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉంటే అప్పుడు ఆధార్, పాన్ కార్డుల్లో వివరాలను సరిచేయాలి. ఆధార్ కార్డులో తప్పుగా ఉన్న పేరును మార్చుకోవాలంటే https://ssup.uidai.gov.in/ssup/login.html లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో లేదా ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆదాయ పన్నుశాఖ వెబ్‌సైట్‌  https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html లో పాన్ వివరాలను సరిచేసుకోవచ్చు. 

వివరాలు ఏమీ తప్పుగా లేకపోతే ఆన్‌లైన్, ఎస్ఎంఎస్, పాన్ కేంద్రాల్లో రెండింటిని లింక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెం‍బర్‌ ద్వారా 567678 లేదా 56161 నెంబర్‌కు యూఐడీపాన్‌ 12 అంకెల ఆధార్‌ పది అంకెల పాన్‌ నెంబర్‌ను ఎస్‌ఎంఎస్‌ పంపడం ద్వారా పాన్‌ ఆధార్‌ లింకేజ్‌ను పూర్తిచేయవచ్చు. ఇక నేరుగా ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌ www.incometaxindiaefiling.gov.in లోకి వెళ్లి పాన్‌ (యూజర్‌ ఐడీ), పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ ఎంటర్‌ చేసి ప్రొఫైల్‌ సెట్టింగ్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేసి లింక్‌ ఆధార్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. అక్కడ మీ పాన్‌ ఆధార్‌ నెంబర్‌తో లింక్‌ అయినట్టు మెసేజ్‌ కనిపంచనిపక్షంలో అక్కడ కనిపించే ఫామ్‌లో మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్‌ వంటి వివరాలను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి. ఒకసారి మీ వివరాలు సబ్‌మిట్‌ చేసిన తర్వాత స్క్రీన్‌పై సక్సెస్‌ మెసేజ్‌ కనిపిస్తుంది. 

చదవండి : ఆధార్‌- పాన్‌ లింకింగ్‌ : డెడ్‌లైన్‌ మిస్సయితే భారీ షాక్‌..

మరిన్ని వార్తలు