5 రోజుల్లోనే డీల్‌ పూర్తి, అదెలా?

13 Oct, 2017 09:24 IST|Sakshi

వ్యాపారాల్లో మార్పులు ఎంత వేగవంతంగా జరుగుతాయో మరోసారి భారతీ గ్రూప్‌, టాటా టెలిసర్వీసు విషయంలో రుజువైంది. కేవలం ఐదే ఐదు రోజుల్లో టాటా టెలిసర్వీసెస్‌, ఎయిర్‌టెల్‌ గూటికి చేరింది. అంతా అయిపోయిందనుకున్న క్షణంలో టాటా టెలిసర్వీసెస్‌కు కొత్త ఊపిరి పోసినట్టైంది. నిజానికి టాటాలకు, భారతీ కంపెనీలకు మధ్య ఈ విషయంపై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆగస్టులో వీరి చర్చలు సమసిపోయాయి. ఇక ఎలాంటి డీల్‌ను కుదుర్చుకునేది లేదని తేల్చేసుకున్నాయి. సెప్టెంబర్‌ చివరి వరకు ఎలాంటి డీల్‌ కానీ, దానిపై ఇసుమంతైనా ప్రస్తావన లేదు. రిలయన్స్‌ జియో, ఇతర టెల్కోలతో టాటా గ్రూప్‌ చర్చలు జరిపినప్పటికీ, అవి కూడా విజయవంతం కాలేదు. చివరికి టాటా టెలిసర్వీసెస్‌ను మూసివేయాలనే టాటా గ్రూప్‌ నిర్ణయించింది. ఈ విషయంపై టాటా గ్రూప్‌కు చెందిన టాప్‌ అధికారులు న్యూఢిల్లీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం అధికారులను కలిశారు. తమ టెలికాం వ్యాపారాలను మూసివేస్తున్నట్టు  గత శుక్రవారం ప్రభుత్వానికి చెప్పేశారు.

కానీ టాటా సన్స్‌కు కొత్త చైర్మన్‌గా వచ్చిన ఎన్‌ చంద్రశేఖరన్‌(చంద్ర) టాటా టెలిసర్వీసెస్‌ను మూసివేయడానికి అసలు ఇష్టపడలేదు. ప్రధానమంత్రి కార్యాలయంలోని అధికారులతో పాటు పలు ప్రభుత్వ సీనియర్‌ అధికారులతో భేటీ అయిన చంద్రశేఖరన్‌, ఈ విషయంపై పలు దఫాల చర్చించారు. ఇప్పటికే టెలికాం పరిశ్రమ ఒత్తిడిలో ఉందని, ఈ సమయంలో ఎలాంటి కంపెనీ మూత పడటానికి ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఇష్టపడలేదు. గత వీకెండ్‌ నుంచి పరిస్థితుల్లో మెల్లమెల్లగా మార్పులు రావడం ప్రారంభమైంది. భారతీ చైర్మన్‌ సునిల్‌ మిట్టల్‌, చంద్రతో సమావేశమయ్యారు. కేవలం ఐదు రోజుల్లోనే ఈ డీల్‌పై ఓ క్లారిటీకి వచ్చేశారు. తమ టెలికాం వ్యాపారాలను విలీనం చేసుకునేందుకు రెండు కంపెనీలు ఆమోదించడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. టాటాలు కూడా తమ 149 ఏళ్ల చరిత్రలో ఏ కంపెనీని మూసివేసిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో టాటా టెలిసర్వీసెస్‌ను, ఎయిర్‌టెల్‌లో కలిపేశారు.  
 

మరిన్ని వార్తలు