పదేళ్లలో రూ. కోటినిధి ఎలా?

2 Jun, 2014 03:13 IST|Sakshi

 సుందరం ఎనర్జీ ఆపర్చునిటీస్, టాటా గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ల కారణంగా  నా పెట్టుబడులపై 30 శాతం నష్టాలొచ్చాయి. ఈ ఫండ్స్‌లో కొనసాగమంటారా? పెట్టుబడులను ఉపసంహరించుకోమంటారా? -అబ్దుల్ సత్తార్, కొత్తగూడెం


 మార్కెట్లు గరిష్ట స్థాయిల్లో ఉన్న 2008లో ఈ రెండు ఫండ్స్ ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా కొంత రికవరీ జరిగినప్పటికీ, చాలా మంది ఇన్వెస్టర్లకు భారీ నష్టాలే వచ్చాయి. ఇటీవల కాలంలో ఈ ఫండ్స్ కొంచెం పుంజుకోవడంతో ఈ నష్టాలు కొంతమేర భర్తీ అయ్యాయి. రానున్న నెలల్లో ఇవి మరింత పుంజుకునే అవకాశాలున్నాయి. అందుకని ఈ  ఫండ్స్‌లో ప్రస్తుతానికి కొనసాగడమే ఉత్తమం. మీ నష్టాలు భర్తీ అయ్యేదాకా వేచి ఉండి, ఆ తర్వాత వైదొలగండి.


 ఎస్‌బీఐ కోమా ఫండ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ ఫండ్‌లో 7-8 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? - కుసుమ, వరంగల్


 ఎస్‌బీఐ కోమా అనేది కమోడిటీ స్టాక్‌ల్లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్ కమోడిటీలను నేరుగా కొనుగోలు చేయదు. కానీ కమోడిటీ వ్యాపారం చేసే కంపెనీల షేర్లను కొనుగోలు చేస్తుంది. ఈ కంపెనీల షేర్లు తీవ్రమైన వ్యవస్థాగత మార్పులకు లోనవుతుంటాయి. గత 3-4 ఏళ్లలో ఈ కంపెనీల షేర్లు సరైన స్థాయిలో పెరగలేదు. కానీ ఈ కంపెనీలకు మంచి రోజులు వచ్చినట్లు చెప్పవచ్చు. అయితే మీ పోర్ట్‌ఫోలియోలో ఈ తరహా ఫండ్ ఒక్కటే ఉండడం సముచితం కాదు. మీ పోర్ట్‌ఫోలియోలో కనీసం 20% ఇలాంటి ఫండ్స్‌కు కేటాయించాలి. దీర్ఘకాలం పెట్టుబడులకైతే డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.

 నా పోర్ట్‌ఫోలియోలో హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్‌డ్ బ్లూచిప్, రిలయన్స్ బ్యాంకింగ్, రిలయన్స్ ఈక్విటీ అపర్చునిటీస్, రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్స్ ఈక్విటీ తదితర ఫండ్స్ ఉన్నాయి. నా పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది? మరికొన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేదా ఈ ఫండ్స్‌ల్లోనే పెట్టుబడులు పెంచమంటారా?  - రామశర్మ, విశాఖ పట్టణం


 మీ పోర్ట్‌ఫోలియో ఓ మోస్తరుగా ఉంది. ఇక మీ పోర్ట్‌ఫోలియోలో బ్యాంకింగ్ ఫండ్ అవసరం లేదు. హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ ఒకే రకమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మీరు మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్‌ల్లో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టాలనుకుంటే, 3-4 డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ ఉండడం ఉత్తమం. వివిధీకరణ దృష్ట్యా మరో రెండు ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెట్టండి.


 నేను మార్కెట్లకు కొత్త. ఇది నా తొలి పెట్టుబడి. మంచి బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. కొన్ని ఫండ్స్ సూచించండి. - జాన్సన్, సికింద్రాబాద్
 బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మంచి నిర్ణయం. తొలిసారిగా ఇన్వెస్ట్ చేసేవారికి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌కు మించింది లేదు. బ్యాలెన్స్‌డ్ ఫండ్ ఎంచుకునేటప్పుడు, కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. మంచి రిటర్న్‌లు సాధించడం, నిలకడగా వృద్ధి సాధించడం వంటి అంశాలను చూడాలి. మంచి రాబడి రావాలంటే, మల్టీ-క్యాప్ లేదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. మీరు ఎంచుకోవడానికి కొన్ని ఫండ్స్- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ అడ్వాండేజ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్, టాటా బ్యాలెన్స్‌డ్ తదితర ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఏడాదికొకసారి మీ పెట్టుబడులను సమీక్షించడం మాత్రం మరువద్దు.

 పదేళ్లలో రూ. కోటి నిధిని తయారు చేయాలనేది నా లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్‌డ్ బ్లూచిప్, యూటీఐ ఆపర్చునిటీస్ ఫండ్స్‌ల్లో ఒక్కోదానిలో రూ.10,000 చొప్పున మూడేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. నెలకు అదనంగా మరో 20,000 ఇన్వెస్ట్ చేయగలను. నా పోర్ట్‌ఫోలియోలో ఏమైనా మార్పులు, చేర్పులు చేయమంటారా?
 - ప్రకాష్ జైన్, హైదరాబాద్
 15% వార్షిక రాబడి పొందడం కోసం నెలకు 30,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ స్థాయి రాబడులు పొందడం కోసం పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయడం సముచితమే. రూ. కోటి నిధి ఏర్పా టు చేయాలన్న మీ లక్ష్యాన్ని మీరు సునాయాసంగానే చేరుకుంటారు. అయితే మీ పోర్ట్‌ఫోలియోలో మీరొక చిన్న మార్పు చేసుకోవాలి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్‌డ్ బ్లూచిప్ ఫండ్‌కు బదులుగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్‌డ్ బ్లూచిప్ అనేది లార్జ్‌క్యాప్ ఫండ్. మీరు భరించే రిస్క్‌కు, మీ ఆర్థిక లక్ష్యానికి ఇది కరెక్ట్ కాదు. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్  స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ ఇలా రకరకాల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీల్లోఇన్వెస్ట్ చేస్తుంది. ఫలితంగా మీ పోర్ట్‌ఫోలియో మరింత మంచి పని తీరు కనబరిచే అవకాశాలున్నాయి. మీరు ఇన్వెస్ట్ చేయనున్న అదనపు రూ.20,000 కోసం 1 లేదా 2 డైవర్సిఫైడ్ ఫండ్స్‌ను పరిశీలించవవచ్చు.
 

మరిన్ని వార్తలు