పెట్రో ధరల తగ్గింపు: నెటిజన్ల సెటైర్స్‌

5 Oct, 2018 12:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2.50 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ  గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో వాహనదారులు కొంతమేర ఉపశమనం పొందారు. అయితే ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తుండగా.. మరికొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. ‘పెట్రో, డీజిల్‌ ధరలను ఎలా పెంచారు.. ఎలా తగ్గిస్తున్నారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

15 దేశాల్లో లీటర్‌ పెట్రోలును రూ.35కే అమ్ముతున్నారని, కానీ మన మోదీగారు మాత్రం కేవలం రెండున్నరే తగ్గించారని కామెంట్‌ చేస్తున్నారు. ఇది కూడా ఎన్నికల డిస్కౌంట్‌ అని,  వాహ్‌ మోదీజీ వాహ్‌ అని ఎద్దేవా చేస్తున్నారు. ఇక అన్ని బీజేపీ పాలిత రాష్ట్రల్లో తగ్గించిన విధంగా మిగతా రాష్ట్రాలో కూడా తగ్గించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ అయితే బీజేపీ భారీ దోపిడి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ నిర్ణయం తీసుకుందని మండిపడింది.

‘గౌరవనీయులైన మోదీజీ.. విపరీతమైన పెట్రో, డీజిల్‌ ధరలతో సామాన్య ప్రజానీకం అల్లాడుతోంది. దయచేసి పెట్రో, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి’ అని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం రూ. 2.50 తగ్గించాయి.  (చదవండి: సుంకం కోత : వివిధ నగరాల్లో పెట్రో ధరలు)


 

>
మరిన్ని వార్తలు