హెచ్‌పీసీఎల్‌ విశాఖ రిఫైనరీ భారీ విస్తరణ

17 Jul, 2017 01:09 IST|Sakshi
హెచ్‌పీసీఎల్‌ విశాఖ రిఫైనరీ భారీ విస్తరణ

రూ.21,000 కోట్ల వ్యయం ప్రాజెక్టులు, మార్కెటింగ్‌
సదుపాయలపై మొత్తం 61,000 కోట్లు
కాకినాడలో పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు


న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ హెచ్‌పీసీఎల్‌ రానున్న నాలుగేళ్లలో ప్రాజెక్టుల విస్తరణపై భారీగా రూ.61,000 కోట్లు వ్యయం చేయనుంది. అధిక నాణ్యతా నిబంధనలను పాటించేందుకు గాను ప్రస్తుతమున్న రిఫైనరీల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, విస్తరించనున్నట్టు కంపెనీ తెలిపింది. ముంబై, విశాఖపట్నం రిఫైనరీలను యూరో–4 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రిఫైనరీ ప్రస్తుతం వార్షికంగా 8.33 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో నడుస్తుండగా, దాన్ని రూ.20,928 కోట్లతో 2020 నాటికి 15 మిలియన్‌ టన్నులకు విస్తరించనుంది.

ముంబై రిఫైనరీని రూ.4,199 కోట్లతో 7.5 మిలియన్‌ టన్నుల నుంచి 9.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి పెంచనుంది. రిఫైనరీ విభాగంలో పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్లపై ప్రధానంగా పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. హెచ్‌పీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 51 శాతం వాటాను ఓఎన్‌జీసీ కొనుగోలు చేసే ప్రతిపాదన ఒకటి ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఈ నెలలోనే కేంద్ర కేబినెన్‌ ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కంపెనీ అధికారి ఒకరు స్పందిస్తూ... ఓఎన్‌జీసీ కిందకు వెళ్లినప్పటికీ ప్రభుత్వ ఆమోదం లభిస్తే పెట్టుబడుల ప్రణాళికలు మారవని స్పష్టం చేశారు.

విశాఖ–విజయవాడ పైప్‌లైన్‌ విస్తరణ
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జాయింట్‌ వెంచర్‌ ప్రాతిపదికన పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్, 9 మిలియన్‌ టన్నుల రిఫైనరీ కమ్‌ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను రాజస్తాన్‌లోని పచపద్ర వద్ద నిర్మిస్తున్నట్టు హెచ్‌పీసీఎల్‌ వెల్లడించింది. అలాగే, పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చేందుకు గాను విశాఖ–విజయవాడ, ముంద్రా–ఢిల్లీ, రామన్‌మండి–బహదూర్‌గఢ్‌ పైపులైన్‌ మార్గాలను విస్తరించనున్నట్టు తెలిపింది. వీటికితోడు వంటగ్యాస్‌ డిమాండ్‌ పెరిగిన దృష్ట్యా కొత్తగా ఎల్‌పీజీ పైపులైన్లు, బాట్లింగ్‌ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. మహారాష్ట్రలో ఐవోసీ 60 మిలియన్‌ టన్నుల మెగా రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రణాళికతో ఉండగా అందులో హెచ్‌పీసీఎల్‌కు 25 శాతం వాటా ఉండనుంది.

మరిన్ని వార్తలు