హెచ్‌పీసీఎల్‌ లాభం 86% అప్‌

9 Aug, 2018 01:08 IST|Sakshi

క్యూ1లో రూ.1,719 కోట్లు...

రిఫైనింగ్‌ మార్జిన్ల జోరు 

రూ.72,923 కోట్లకు ఆదాయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొ(హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 86 శాతం ఎగసింది. గత క్యూ1లో రూ.925 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,719 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్‌ తెలియజేసింది. అధిక రిఫైనింగ్‌ మార్జిన్ల కారణంగా ఈ క్యూ1లో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని హెచ్‌పీసీఎల్‌ సీఎమ్‌డీ ముకేష్‌  సురానా తెలిపారు. ఆదాయం రూ.59,891 కోట్ల నుంచి రూ.72,923 కోట్లకు పెరిగింది. ఈ క్యూ1లో 9.63 మిలియన్‌ టన్నుల ఇంధన విక్రయాలు జరిపామని, ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక అమ్మకాలని సురానా పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఈ కంపెనీ రూ.1,435 కోట్ల నికర లాభం సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు.  

పెరిగిన ఇన్వెంటరీ లాభాలు.. 
ఒక్కో బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చినందుకు ఈ క్యూ1లో 7.15 డాలర్ల రిఫైనింగ్‌ మార్జిన్‌ సాధించామని సురానా తెలిపారు. గత క్యూ1లో ఈ మార్జిన్‌ 5.86 డాలర్లుగా ఉంది. గత క్యూ1లో ఒక్కో బ్యారెల్‌ ముడి చమురుకు 2.86 డాలర్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని, ఈ క్యూ1లో మాత్రం 3.43 డాలర్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయని తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.8,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు సురానా తెలిపారు.
 

మరిన్ని వార్తలు