ఇంటి నుంచే చక్కబెట్టేస్తారు..

3 Apr, 2020 17:22 IST|Sakshi

ముంబై/న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 ప్రతాపంతో పలు కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. అయితే కరోనా మహమ్మారి భయాలు క్రమంగా వైదొలగినా నయా పనిసంస్కృతి మాత్రం కొనసాగుతుందని కార్పొరేట్‌ కంపెనీలు చెబుతున్నాయి. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) సంస్థకూ, ఉద్యోగులకూ ప్రయోజనకరమని దిగ్గజ కంపెనీల మానవ వనరుల విభాగాధిపతులు పేర్కొన్నారు.

ఈ విధానం ద్వారా ఉద్యోగులకు గంటల తరబడి కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రయాణ సమయం ఆదా అవుతుందని, పని-జీవితం సమన్వయపరుచుకోవడంలో వెసులుబాటు లభిస్తుందని ఇక యాజమాన్యాలకు నిర్వహణ ఖర్చు తగ్గడం, ఉత్పాదకత పెరగడం వంటి ప్రయోజనాలు చేకూరతాయని వారు చెప్పుకొచ్చారు. వర్చువల్‌ పనిప్రదేశాలదే భవిష్యత్‌ అని యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఆర్పీజీ గ్రూప్‌, వేదాంత, ఈవై, కాగ్నిజెంట్‌, టైటాన్‌, డెలాయిట్‌, విర్ల్‌పూల్‌, పేటీఎం, సెయింట్‌ గోబెయిన్‌ ఇండియా వంటి పలు ప్రముఖ కంపెనీల హెచ్‌ఆర్‌ హెడ్స్‌ అభిప్రాయపడ్డారు.

చదవండి : ఐటీకి మహమ్మారి ముప్పు

ఇంటి నుంచి పనిచేసే విధానం ఇక ముందు కొనసాగుతుందని యాక్సిస్‌ బ్యాంక్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌కమల్‌ వెంపటి అన్నారు. కస్టమర్లతో భేటీ అవసరం లేని పనులన్నీ మారుమూల నుంచీ చక్కబెట్టవచ్చని..దాదాపు 30 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయవచ్చని చెప్పారు. డబ్ల్యూఎఫ్‌హెచ్‌ ద్వారా సులభతర వాణిజ్యంతో పాటు వ్యయాల తగ్గింపు కలిసివస్తుందని ఈవై ఇండియా పార్టనర్‌, టాలెంట్‌ లీడర్‌ సందీప్‌ కోహ్లి అన్నారు.

చాలా దేశాల్లో డబ్ల్యూఎఫ్‌హెచ్‌ ఓ సానుకూల పనివిధానంగా అందరూ ఆమోదించడం మనం చూస్తున్నామని కాగ్నిజెంట్‌ ఇండియా చీఫ్‌ రాంకుమార్‌ రామమూర్తి చెప్పుకొచ్చారు. గతంలో ఈ విధానాన్ని అనుసరించని వారు సైతం సాంకేతిక సదుపాయాలు మెరుగైన క్రమంలో వారికి ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉండబోవని ఆర్పీజీ గ్రూప్‌ హెడ్‌ (నైపుణ్యాభివృద్ధి) అజర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు