తెలంగాణలో హెచ్‌ఎస్‌ఐఎల్‌ రెండు కొత్త ప్లాంట్లు

22 Feb, 2017 01:15 IST|Sakshi
తెలంగాణలో హెచ్‌ఎస్‌ఐఎల్‌ రెండు కొత్త ప్లాంట్లు

మెదక్‌లోని ఇస్నాపూర్‌లో రూ.300 కోట్ల పెట్టుబడులు
రూ.60 కోట్లతో బీబీనగర్‌లోని సిరామిక్‌ ప్లాంట్‌ విస్తరణ కూడా..
హెచ్‌ఎస్‌ఐఎల్‌ వీసీఎండీ సందీప్‌ సొమానీ  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సొమానీ గ్రూప్‌కు చెందిన హిందుస్థాన్‌ శానిటరీవేర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఐఎల్‌) తెలంగాణలో మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. రూ.300 కోట్ల పెట్టుబడులతో మెదక్‌లోని ఇస్నాపూర్‌లో ప్రీమియం పైప్స్‌ అండ్‌ క్యాప్స్‌ (సెక్యూరిటీ క్లోజర్‌ సొల్యూషన్స్‌), సీపీవీసీ (క్లోరినేటెడ్‌ పాలి వినైల్‌ క్లోరైడ్‌) పైప్స్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌ఎస్‌ఐఎల్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ సొమానీ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు. ఈ రెండు ప్లాంట్ల ద్వారా ప్రత్యక్షంగా 800–900 మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలొస్తాయన్నారు.

ప్లాంట్ల నిర్మాణం కూడా పూర్తయిందని, ఉత్పత్తుల తయారీకి అవసరమైన మిషనరీని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ప్లాంట్‌లో ఉత్పత్తుల తయారీ ట్రయల్‌ రన్‌లో ఉందని, మార్చి ముగింపు నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అలాగే సీపీవీసీ ప్లాంట్‌ను జూలై నాటికి ప్రారంభిస్తామని చెప్పారు. సీపీవీసీ ప్లాంట్‌ సామర్థ్యం ఏటా 30 వేల టన్నులుగా ఉంటుందని.. వీటి దేశీయంగా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.  ఇస్నాపూర్‌లో సంస్థకిక్కడ 84 ఎకరాల స్థలముంది. ప్రస్తుతానికి కొంత భాగంలోనే ఈ ప్లాంట్లను నిర్మిస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

బీబీనగర్‌ ప్లాంట్‌ విస్తరణ..
ప్రస్తుతం హెచ్‌ఎస్‌ఐఎల్‌కు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 3 ప్లాంట్లున్నాయి. వీటి నుంచి శానిటరీ, గ్లాస్‌ బాటిల్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. తాజాగా రూ.60 కోట్ల పెట్టుబడులతో  బీబీనగర్‌లోని సిరామిక్‌ ప్లాంట్‌ను సామర్థ్యాన్ని విస్తరించనుంది. దీంతో ప్రస్తుతం ఏటా 38 లక్షల టన్నులుగా ఉన్న ప్లాంట్‌ సామర్థ్యం 42 లక్షలకు చేరుతుందని తెలిపారు. జూలై నుంచి విస్తరిత ప్లాంట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ‘‘2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.1,948 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం.

40 శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకున్నాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా వంటి దేశాలకు హెచ్‌ఎస్‌ఐఎల్‌ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. ఏటా మొత్తం వ్యాపారంలో ఎగుమతుల వాటా రూ.70–80 కోట్లుగా ఉంటుందని’’ సందీప్‌ వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,500 మంది డీలర్లు, 18 వేల ఔట్‌లెట్లున్నాయని 2020 నాటికి 20 వేల ఔట్‌లెట్లకు చేర్చుతామని చెప్పారు.

మార్కెట్లోకి హింద్‌వేర్‌ కూలర్లు..
హెచ్‌ఎస్‌ఐఎల్‌ హింద్‌వేర్‌ స్నోక్రెస్ట్‌ పేరిట ఎయిర్‌కూలర్లను మంగళవారమిక్కడ మార్కెట్లోకి విడుదల చేసింది. కూలర్‌ ముందు భాగంలోని ప్యానెల్స్‌ను మార్చుకోగలిగే వీలుండటం దీని ప్రత్యేకత. డెసర్ట్, పర్సనల్, విండో విభాగాల్లో 14 మోడల్స్‌లో అందుబాటులో ఉంటాయి. 18 లీటర్ల నుంచి 100 లీటర్ల శ్రేణిలో లభిస్తాయి. ధర రూ.8,990–17,990 మధ్య ఉన్నాయి. వీటిని హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్లాంట్లలో తయారు చేశారు.

>
మరిన్ని వార్తలు