హువావే ఆనర్.. మూడు 4జీ స్మార్ట్ఫోన్లు

13 Oct, 2016 00:16 IST|Sakshi
హువావే ఆనర్.. మూడు 4జీ స్మార్ట్ఫోన్లు

ధరలు రూ.9,999 నుంచి రూ.29,999 రేంజ్‌లో
బ్రాండ్‌ అంబాసిడర్‌గా సైనా నెహ్వాల్

 సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ కంపెనీ హువావే, ఆనర్ బ్రాండ్‌లో మూడు 4జీ స్మార్ట్‌ఫోన్లను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆనర్ 8, ఆనర్ 8 స్మార్ట్, ఆనర్ హోలీ 3 పేరుతో రూపొందించిన ఈ మూడు స్మార్ట్ ఫోన్లను బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా, నటి నిమ్రత్ కౌర్, ఆనర్ గ్లోబల్ ప్రెసిడెంట్ జియోర్జ్ జో విడుదల చేశారు. ఆనర్ ఫోన్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా  వ్యవహరించడానికి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని  హువావే. ఆనర్ ఇండియా కన్సూమర్  బిజినెస్ హెడ్ పి. సం జీవ్ పేర్కొన్నారు. ఆనర్ 8 అమ్మకాలు ప్రారంభించామని పేర్కొన్న కంపెనీ, ఆనర్ 8 స్మార్ట్, ఆనర్ హోలీ 3 ఫోన్లను ఎప్పుడు విక్రయించేదీ వెల్లడించలేదు.

ఆనర్ 8 @రూ.29,999
ఆనర్ 8 ఫోన్‌లో వెనక వైపు 12 మెగాపిక్సెల్ డ్యుయల్ లెన్స్ కెమెరా, ముందు వైపు 8మెగా పిక్సెల్ కెమెరా, ఇమేజ్ ఎన్‌హాన్స్‌మెంట్, ఫోకస్ చేంజ్‌లతో పాటు కెమెరా అడ్జెస్ట్‌మెంట్ ఫీచర్లు-లైట్ అపెర్చర్, షట్టర్ స్పీడ్ వంటి ప్రత్యేకతలున్నాయి.  హువాయ్ కిరిన్ 950 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3100ఎంఏహెచ్ బ్యాటరీ, 128 జీబీ ఎక్స్‌టర్నల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.29,999.

ఈ  మోడల్‌కు రెండేళ్ల వారంటీని కంపెనీ ఇస్తోంది.  ఇక ఆనర్ 8 స్మార్ట్ మోడల్‌ఫోన్‌లో 5.2 అంగుళాల స్క్రీన్, 13 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.  ధర రూ.19,999. ఆనర్ హోలి 3లో 5.5 అంగుళాల డిస్‌ప్లే, 13 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. భారత్‌లోనే తయారైన కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. ధర రూ.9,999.

 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యం..
వచ్చే ఏడాది కల్లా 10% మార్కెట్ వాటా సాధిం చడం,  భారత్‌లో మూడో అతి పెద్ద మొబైల్ కంపెనీగా అవతరించడం లక్ష్యాలని సంజీవ్ తెలిపారు.

మరిన్ని వార్తలు