హెచ్‌యూఎల్‌కు హార్లిక్స్‌ బూస్ట్‌

4 Dec, 2018 00:56 IST|Sakshi

డీల్‌ విలువ రూ.27,750 కోట్లు

హెచ్‌యూఎల్‌లో విలీనం కానున్న జీఎస్‌కే ఇండియా

ఒక్కో జీఎస్‌కే షేరుకు 4 హెచ్‌యూఎల్‌ షేర్లు  

న్యూఢిల్లీ: దేశ ఎఫ్‌ఎంసీజీ రంగంలో భారీ డీల్‌ సాకారమైంది. ఫలితం... దేశీయ న్యూట్రిషనల్‌ హెల్త్‌ డ్రింక్స్‌ మార్కెట్లోకి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇటీవలే కాంప్లాన్‌ బ్రాండ్‌ చేతులు మారగా... దశాబ్దాలుగా న్యూట్రిషనల్‌ హెల్త్‌ డ్రింక్స్‌ విభాగంలో దేశంలో టాప్‌ బ్రాండ్లుగా వెలుగుతున్న... గ్లాక్సో స్మిత్‌క్లయిన్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌కు (జీఎస్‌కే) చెందిన హార్లిక్స్, బూస్ట్‌ ఇక హెచ్‌యూఎల్‌ చేతిలోకి వెళ్లాయి. ఈక్విటీ విలీనం రూపంలో జరిగే ఈ డీల్‌ విలువ 3.1 బిలియన్‌ పౌండ్లు (రూ.27,750 కోట్లు). భారత్‌తో పాటు ఆసియాలోని మరో 20కి పైగా దేశాల్లో జీఎస్‌కేకు చెందిన ఫుడ్, డ్రింక్స్‌ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేస్తున్నట్టు హెచ్‌యూఎల్‌ మాతృ సంస్థ యూనిలీవర్‌ ప్రకటించింది. యూనిలీవర్‌కు చెందిన భారత విభాగం హెచ్‌యూఎల్‌... ఈక్విటీ విలీనం రూపంలో జీఎస్‌కే హెల్త్‌కేర్‌ను సొంతం చేసుకోనుంది. ఇందుకు హెచ్‌యూఎల్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జీఎస్‌కే కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ ఇండియాను పూర్తిగాను, జీఎస్‌కే బంగ్లాదేశ్‌ లిమిటెడ్‌లో 82 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు, వీటితోపాటు భారత్‌కు వెలుపల పలు వాణిజ్య ఆస్తులు కూడా ఈ డీల్‌లో భాగంగా ఉన్నాయని యూనిలీవర్‌ తెలిపింది. విలీనంలో భాగంగా జీఎస్‌కే కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ వాటాదారులకు వారి వద్దనున్న ప్రతీ ఒక్క షేరుకు 4.39 హెచ్‌యూఎల్‌ షేర్లను జారీ చేస్తుంది. ఈ విలీనం ఇరు కంపెనీల వాటాదారులు, నియం త్రణ సంస్థల ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. జీఎక్‌కే కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ ఇండియాలో జీఎస్‌కేకు 72.5 శాతం వాటా ఉండగా, హెచ్‌యూఎల్‌లో యూనిలీవర్‌కు 67.2 శాతం వాటా ఉంది.  

భారత్‌ మాకు కీలక మార్కెట్‌: జీఎస్‌కే  
హార్లిక్స్‌ భారత్‌లో ఎన్నో దశాబ్దాలుగా జీఎస్‌కేకు ఆదాయాన్ని, వినియోగదారులకు ఆరోగ్యాన్ని అందించిందని ఈ కంపెనీ సీఈవో ఎమ్మా వామ్‌స్లే అన్నారు. ఈ బ్రాండ్‌ భవిష్యత్తు అవకాశాలను యూనిలీవర్‌ అందుకోగలదన్న ఆశాభాశాన్ని వ్యక్తం చేశారు. ఈ డీల్‌ ద్వారా తమకొచ్చే నిధులను ఫార్మా వ్యాపారం, గ్రూపు వ్యూహాత్మక ప్రాధాన్యతల కోసం వినియోగిస్తామని ఆమె చెప్పారు. భారత్‌ ఇకముందూ తమకు ముఖ్యమైన మార్కెట్‌గా ఉంటుం దని జీఎస్‌కే ప్రకటించింది. ఓటీసీ, క్రోసిన్, ఈనో, సెన్సోడైన్‌ తదితర ఓరల్‌ హెల్త్‌ బ్రాండ్ల విభాగంలో వృద్ధి అవకాశాల కోసం పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. జీఎస్‌కే కన్జ్యూమర్‌ను విలీనం చేసుకోనున్న హెచ్‌యూఎల్‌... ఐదేళ్లపాటు జీఎస్‌కేకు చెందిన ఓటీసీ, ఓరల్‌ హెల్త్‌ బ్రాండ్లను కూడా పంపిణీ చేస్తుంది. ఇది కూడా ఒప్పందంలో భాగం. 

హెచ్‌యూఎల్‌ షేరు ఆల్‌టైమ్‌ హై...
జీఎస్‌కే హెల్త్‌కేర్‌ కొనుగోలు హెచ్‌యూఎల్‌ షేర్లపై ఇన్వెస్టర్లలో ఆసక్తికి దారితీసింది. దీంతో హెచ్‌యూఎల్‌ షేరు బీఎస్‌ఈలో 4 శాతానికి పైగా లాభపడి రూ.1,826 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 4.89 శాతం వరకు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 1,839ని నమోదు చేయడం గమనార్హం.  

హెల్త్‌డ్రింక్స్‌ మార్కెట్లో కొత్త పోటీ 
న్యూట్రిషనల్‌ హెల్త్‌డ్రింక్స్‌ విభాగంలో కొత్త పోటీ నెలకొందనే చెప్పాలి. దశాబ్దాలుగా హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా, కాంప్లాన్‌ తదితర బ్రాండ్లు భారతీయులకు ఎంతో సుపరిచితం. అయితే, ఈ విభాగంలో వృద్ధి తగ్గుతోంది. చక్కెర అధికంగా ఉండే ఉత్పత్తులకు వినియోగదారులు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. హార్లిక్స్‌లో 20 శాతం పంచదారే. దీంతో బహుళజాతి సంస్థలు కొత్త మార్గాలను చూడకుండా తమ బ్రాండ్లను అమ్ముకోవడంపై దృష్టి సారించాయి. దీంతో కాంప్లాన్, హార్లిక్స్, బూస్ట్‌ బ్రాండ్లు చేతులు మారాయి. అమెరికాకు చెందిన క్రాఫ్ట్‌హీంజ్‌ నుంచి కాంప్లాన్‌తో పాటు గ్లూకోన్‌ డి, నైసిల్‌ను రూ.4,595 కోట్లు వెచ్చించి అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ వెల్‌నెస్‌ అక్టోబర్‌లో కొనుగోలు చేసింది. ఈ విభాగంపై భారీ ఆశలతోనే భారీ డీల్‌కు జైడస్‌ ముందడుగు వేసింది. ఇక హార్లిక్స్, బూస్ట్‌ బ్రాండ్ల కోసం అగ్రగామి ఎఫ్‌ఎంసీజీ నెస్లే కూడా యూనిలీవర్‌తో పోటీపడటం గమనార్హం. 

సుదీర్ఘ చరిత్ర...
‘‘హార్లిక్స్‌ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో వారసత్వం, విశ్వసనీయత ఉన్నాయి. ఈ కొనుగోలు మా ఆహారం, రిఫ్రెష్‌మెంట్‌ వ్యాపారాన్ని సమూలంగా మార్చేస్తుంది. ఆరోగ్య పానీయాల విభాగంలోకి ప్రవేశించేందుకు వీలు కల్పిస్తుంది. ఆరోగ్య విభాగంలో మా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది’’ అని యూనిలీవర్‌ ప్రెసిడెంట్‌ నితిన్‌ పరాంజపే తెలిపారు. గొప్ప ఉత్పత్తుల ద్వారా తమ వినియోగదారుల పోషకావసరాలను తీర్చే విభాగంలోకి ప్రవేశించేందుకు ఈ వ్యూహాత్మక విలీనంతో వీలవుతుందని హెచ్‌యూఎల్‌ చైర్మన్, సీఈవో సంజీవ్‌ మెహతా తెలిపారు. ‘‘మా ఆహారం, రీఫ్రెష్‌మెంట్స్‌ (ఎఫ్‌అండ్‌ఆర్‌) వ్యాపార టర్నోవర్‌ రూ.10,000 కోట్లను అధిగమించగలదు. ఈ విభాగంలో దేశంలో ఒకానొక అతిపెద్ద సంస్థగా ఉంటాం’’ అని మెహతా తెలిపారు. ప్రస్తుతం తమ ఎఫ్‌అండ్‌ఆర్‌ వ్యాపారం రూ.2,400 కోట్లుగా ఉన్నట్టు హెచ్‌యూఎల్‌ సీఎఫ్‌వో శ్రీనివాస్‌ పాఠక్‌ తెలిపారు. మధ్య కాలానికి రెండంకెల స్థాయిలో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నామని, తమకు ఈ కొనుగోలు ఒక భారీ వ్యాపార అవకాశమని పేర్కొన్నారు.

డీల్‌లో ముఖ్యాంశాలివీ..
హెచ్‌యూఎల్‌ సొంతం కానున్న బ్రాండ్లు... హార్లిక్స్, బూస్ట్, మాల్టోవా, వివా. ఇందులో హార్లిక్స్‌ బ్రాండ్‌ జీఎస్‌కే ఇండియా పరిధిలో కాకుండా, మాతృసంస్థ జీఎస్‌కే చేతిలో ఉంది. ఈ బ్రాండ్‌ను తాము కొనుగోలు చేయడం లేదని, అయినప్పటికీ ఈ వ్యాపారంపై తమకు హక్కులుంటాయని హెచ్‌యూఎల్‌ సీఎఫ్‌వో పాఠక్‌ తెలిపారు.   ప్రతి ఒక జీఎస్‌కే కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ షేరుకు 4.39 షేర్లను కేటాయిస్తారు. ఈ ప్రకారం జీఎస్‌కే హెల్త్‌కేర్‌ ఇండియా షేరు విలువ రూ.7,540. విలీనం తర్వాత హెచ్‌యూఎల్‌లో జీఎస్‌కేకు 5.7 శాతం వాటా లభిస్తుంది. అయితే, ఈ విలీన డీల్‌ ముగిశాక తమ వాటాను విక్రయిస్తామని జీఎస్‌కే ప్రకటించింది. ఈ డీల్‌ 2019 చివరి నాటికి పూర్తవుతుందని ఇరు కంపెనీల అంచనా.

140 సంవత్సరాలపై మాటే... 
హార్లిక్స్‌ బ్రాండ్‌కు 140 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అందుకే భారీగా చెల్లించేందుకు యూనిలీవర్‌ ధైర్యం చేసింది. రూ.10,000 కోట్ల వ్యాపార టర్నోవర్‌కు అధిక మొత్తంలో చెల్లించేం దుకు ముందుకు వచ్చింది. హార్లిక్స్, బూస్ట్, వివా, 800 డిస్ట్రిబ్యూటర్లుతోపాటు హెల్త్‌ ఫుడ్‌ డ్రింక్‌ మార్కెట్లో 50 శాతం వాటా హెచ్‌యూఎల్‌ సొంతమవుతాయి. మరి హెచ్‌యూఎల్‌కు దేశవ్యాప్తంగా 70 లక్షల రిటైల్‌ స్టోర్లతో అనుసంధానత ఉంది. దీంతో హెచ్‌యూఎల్‌ తనకున్న బలం తో హార్లిక్స్, బూస్ట్‌ బ్రాండ్ల వ్యాపారం పెంచుకోగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

మరిన్ని వార్తలు