హెచ్‌యూఎల్‌ నికర లాభం రూ. 1,351 కోట్లు

15 May, 2018 00:07 IST|Sakshi

క్యూ4లో 14 శాతం వృద్ధి

ఒక్కో షేర్‌కు రూ.12 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన రూ.1,351 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. హోమ్‌ కేర్‌ బిజినెస్‌ అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని హెచ్‌యూఎల్‌ వివరించింది.

2016–17లో ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం రూ.1,183 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి సాధించామని సంస్థ చైర్మన్‌ హరీశ్‌ మన్వాని చెప్పారు. నికర అమ్మకాలు రూ.8,773 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.9,003 కోట్లకు, ఇబిటా 24 శాతం వృద్ధితో రూ.2,048 కోట్లకు  పెరిగాయన్నారు. మొత్తం వ్యయాలు రూ.7,349 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.7,181 కోట్లకు చేరాయి.

తాజా క్యూ4లో దేశీయ వృద్ధి 16 శాతంగా ఉందని, అమ్మకాలు 11 శాతం పెరిగాయని చెప్పారాయన. ఇబిటా మార్జిన్‌ 1.6 శాతం వృద్ధితో 22.5 శాతానికి ఎగిసింది. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.12 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నికర లాభం, అమ్మకాల విషయంలో విశ్లేషకుల అంచనాలను మించిన ఫలితాలను ఈ కంపెనీ ప్రకటించింది. ధరలు పెంచాక కంపెనీ పూర్తి క్వార్టర్‌కు ప్రకటించిన తొలి ఫలితాలివి.

పోటీ తీవ్రంగా ఉన్నా, మంచి ఫలితాలు...
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.4,490 కోట్లుగా ఉన్న నికర లాభం 16 శాతం లాభంతో రూ.5,227 కోట్లకు చేరింది. నికర అమ్మకాలు రూ.34,964 కోట్ల నుంచి స్వల్ప వృద్ధితో రూ.35,474 కోట్లకు పెరిగాయి. దేశీయ కన్సూమర్‌ బిజినెస్‌ 12 శాతం వృద్ధి చెందిందని, నగదు నిల్వలు 20 శాతం వృద్ధితో రూ.8,126 కోట్లకు ఎగిశాయని మన్వానీ తెలిపారు.

పోటీ తీవ్రంగా ఉన్నా 2017–18 ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించామంటూ ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.ఫలితాలు అంచనాలను మించడం, రూ.12 డివిడెండ్‌ను ఇవ్వనుండడం వంటి సానుకూలాంశాల నేపథ్యంలో బీఎస్‌ఈ ఇంట్రాడేలో ఈ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,522ను తాకింది. చివరకు స్వల్ప నష్టంతో రూ.1,505 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు