-

హెచ్‌యూఎల్‌ లాభం 1,326 కోట్లు

18 Jan, 2018 00:07 IST|Sakshi

క్యూ3లో 27 శాతం వృద్ధి

 ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైకి షేరు 

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలివర్‌ (హెచ్‌యూఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,326 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.1,038 కోట్లతో పోలిస్తే 28 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. గత క్యూ3లో రూ.8,400 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 4 శాతం వృద్ధితో రూ.8,742 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్‌ హరిశ్‌ మన్వాని చెప్పారు. గత క్యూ3లో రూ.7,067 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు ఈ క్యూ3లో  రూ.7,036 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఇబిటా రూ.1,162 కోట్ల నుంచి 45 శాతం వృద్ధితో రూ.1,680 కోట్లకు,  ఇబిటా మార్జిన్‌ 15.5% నుంచి 19.6%కి పెరిగాయని పేర్కొన్నారు. 

అన్ని కేటగిరీల్లో మంచి వృద్ధి...
ఈ క్యూ3లో మంచి పనితీరు కనబరిచామని మన్వాని సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కేటగిరీల్లో మంచి వృద్ధి సాధించామని, మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. కీలక బ్రాండ్లపై మరింతగా పెట్టుబడులు పెడతామని, భవిష్యత్తు కోసం మరిన్ని కేటగిరీలను అభివృద్ధి చేస్తామని వివరించారు. కమోడిటీల ధరల పెరుగుదల సెగ ఇప్పుడిప్పుడే తగులుతోందని, వ్యయ నియంత్రణ పద్ధతులపై మరింతగా దృష్టిపెడుతున్నామని పేర్కొన్నారు. లాభదాయకతకను నిలకడగా కొనసాగించడానికి, పోటీని తట్టుకునేందుకు మరింత దూకుడుగా వ్యాపార నిర్వహణ సాగిస్తామని తెలిపారు. ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ కారణంగా స్కిన్‌ కేర్‌ సెగ్మెంట్, డవ్, పియర్స్‌ కారణంగా వ్యక్తిగత ఉత్పత్తుల సెగ్మెంట్‌లు మంచి వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు. పర్సనల్‌ కేర్‌ సెగ్మెంట్‌ ఆదాయం రూ.3,980 కోట్ల నుంచి రూ.4,090 కోట్లకు, హోమ్‌ కేర్‌ డివిజన్‌ రూ.2,689 కోట్ల నుంచి రూ.2,741 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఫలితాలు అంచనాలను మించడంతో  బీఎస్‌ఈలో హెచ్‌యూఎల్‌ షేర్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,390ను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 0.7 శాతం క్షీణించి రూ.1,372 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు