కీలకంగా హైదరాబాద్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ 

4 Dec, 2018 01:14 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిలో ఈ కేంద్రం కీలకం కానుంది. భారత కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఆవిష్కరణలకు ఊతమిస్తుందని వన్‌ప్లస్‌ ఫౌండర్‌ పీట్‌ లూ వెల్లడించారు. మూడేళ్లలో ఇక్కడి ఆర్‌అండ్‌డీ కేంద్రం అతిపెద్ద సెంటర్‌గా అవతరిస్తుందని చెప్పారు. ‘సంస్థకు అతిపెద్ద మార్కెట్లలో భారత్‌ ఒకటి.

అలాగే అంతర్జాతీయంగా విజయవంతం అయ్యే ఉత్పత్తుల రూపకల్పనకు సైతం బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది. పరిశోధన, అభివృద్ధి ప్రయత్నాలను ముమ్మరం చేసి అంతర్జాతీయ ఉత్పాదన రూపకల్పనలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. స్టార్టప్‌లు కొలువుదీరడంతోపాటు నిపుణులైన మానవ వనరులు ఉన్నందునే భారత్‌లో తొలి ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను భాగ్యనగరిలో నెలకొల్పుతున్నాం. వన్‌ప్లస్‌కు వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో హైదరాబాద్‌ ఒకటి. ఈ ప్రాంతంలో ఆఫ్‌లైన్‌ విపణిని విస్తరిస్తాం’ అని వివరించారు. 

మరిన్ని వార్తలు