హైదరాబాద్‌ రియల్టీలోకి రూ.940 కోట్ల పీఈ పెట్టుబడులు!

20 Jan, 2018 02:20 IST|Sakshi

2016తో పోలిస్తే 30 శాతం క్షీణత.. దేశంలోకి రూ.42,800 కోట్ల నిధులు

2004 తర్వాత దేశీయ రియల్టీ రంగంలోకి ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు రికార్డు స్థాయిలోకి చేరాయి. 2017లో స్థిరాస్తి రంగంలోకి రూ.42,800 కోట్ల పీఈ నిధులొచ్చాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల సరళీకరణ, జీఎస్‌టీ అమలు, రీట్స్‌ నిబంధనల రూపకల్పన వంటివే ఇందుకు కారణమని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక తెలిపింది. 2016తో పోలిస్తే 17 శాతం, 2008తో పోలిస్తే 52 శాతం వృద్ధి.  


సాక్షి, హైదరాబాద్‌ :  పెద్ద నోట్ల రద్దు, రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమలుతో దేశంలో నివాస విభాగం ఒక్కసారిగా కుదేలైంది. దీని ప్రభావం పీఈ నిధులపైన కూడా పడింది. అందుకే 2016లో రూ.21,870 కోట్ల పీఈ నిధులను ఆకర్షించిన నివాస విభాగం 2017 నాటికి 29 శాతం క్షీణతతో 15,600 కోట్లకు పడిపోయింది. ఆఫీసు విభాగం మాత్రం ఏడాది కాలంలో మూడింతల వృద్ధిని నమోదు చేసింది. 2017లో ఆఫీసు విభాగంలోకి రూ.13,200 కోట్ల పెట్టుబడులొచ్చాయి. 2016లో ఇది రూ.3,980 కోట్లుగా ఉంది.

ఏడాదిలో రికార్డు స్థాయికి పారిశ్రామిక విభాగం..
2016లో ఒక్క పీఈ డీల్‌ కూడా జరగని పారిశ్రామిక రంగంలో 2017లో ఏకంగా 6,540 కోట్ల పీఈ నిధులొచ్చాయి. మిక్స్‌డ్‌ యూజ్‌ విభాగం 320 కోట్ల నుంచి 4,240 కోట్ల వృద్ధిని సాధించింది. ఆతిథ్య రంగం 1,240 కోట్ల నుంచి 380 కోట్లకు, రిటైల్‌ 6,300 కోట్ల నుంచి 2,860 కోట్లకు పడిపోయాయి.

హైదరాబాద్‌లో తగ్గిన పీఈ..
నగరాల వారీగా పీఈ నిధుల జాబితాను పరిశీలిస్తే.. ముంబై, చెన్నై మినహా అన్ని నగరాలూ క్షీణతలో ఉన్నాయి. 2016లో రూ.1,340 కోట్ల పీఈ నిధులను ఆకర్షించిన హైదరాబాద్‌.. 2017 నాటికి 30 శాతం క్షీణతతో రూ.940 కోట్లకు పడిపోయింది. పుణె రూ.1,860 కోట్ల నుంచి రూ.1,450 కోట్లకు తగ్గింది. అత్యధికంగా ముంబై పీఈ నిధులను ఆకర్షించింది.

2016లో రూ.10,590 కోట్ల పెట్టుబడులు రాగా.. 2017 నాటికివి 41 శాతం వృద్ధితో రూ.15,000 కోట్లకు పెరిగాయి. చెన్నైలో 149 శాతం వృద్ధితో రూ.120 కోట్ల నుంచి 2,970 కోట్లకు చేరాయి. ఇక ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో రూ.9,390 కోట్ల నుంచి రూ.4,380 కోట్లకు, బెంగళూరు రూ.6,340 కోట్ల నుంచి రూ.5,170 కోట్లకు తగ్గాయి. అయితే 2017లో పీఈ నిధులను సమీకరించిన నగరాల వారీగా చూస్తే మాత్రం ముంబై తర్వాత ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరులే నిలిచాయి.

2018లోనూ ఆఫీసు, పారిశ్రామిక రంగమే!
లాజిస్టిక్‌ రంగానికి మౌలిక రంగ హోదా దక్కడంతో ఇన్వెస్టర్లు గిడ్డంగులు, పారిశ్రామిక రంగం మీద దృష్టిసారించారు. నిలకడైన రిటర్న్స్, రీట్స్‌ అందుబాటులోకి రానుండడంతో సంస్థాగత పెట్టుబడిదారులు ఆఫీసు విభాగంపై ఫోకస్‌ పెట్టారు. 2018లోనూ ఆఫీసు, పారిశ్రామిక రంగాల్లో దేశీయ పెట్టుబడిదారులతో పోలిస్తే విదేశీ ఇన్వెస్టర్ల డిమాండ్‌ ఎక్కువగా ఉండే అవకాశముంది.
– అన్షుల్‌ జైన్, కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఇండియా ఎండీ

మరిన్ని వార్తలు