కొత్త ప్రభుత్వంలోనే రియల్టీ పరుగులు!

1 Mar, 2014 01:13 IST|Sakshi
కొత్త ప్రభుత్వంలోనే రియల్టీ పరుగులు!

సాక్షి, హైదరాబాద్: ‘‘ఆరేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నిర్మాణ రంగానికి మరో ఆరు నెలల పాటు కష్టాలు తప్పవు. ఎన్నికల తర్వాత ఇరు రాష్ట్రాల్లోనూ ఏర్పడే కొత్త ప్రభుత్వ పాలసీలతోనే నిర్మాణ రంగం మళ్లీ పరుగులు పెడుతుందని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ధీమా వ్యక్తం చేసింది. క్రెడాయ్ హైదరాబాద్ 3 రోజుల ప్రాపర్టీ షో శుక్రవారం నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో ప్రారంభమైంది.

ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ పోటీని ఎదుర్కొని మరీ హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్, మెట్రో, మాస్టర్‌ప్లాన్, ఐటీఐఆర్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లను తీసుకొచ్చాం. ఇక నాయకులుగా మా పనైపోయింది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇకపై బిల్డర్లపైనే ఉందన్నారు. ఎన్నికల తర్వాత ఇక్కడ ఏర్పడే కొత్త ప్రభుత్వం నిర్మాణ రంగానికి పూర్తి సహకారాన్నందిస్తుందని హామీ ఇచ్చారు. చార్మినార్, సైబర్‌టవర్స్ లాగే అంతర్జాతీయ స్థాయిలో గేమ్ పార్క్ రూపుదిద్దుకోనుందన్నారు. క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పన్ను రాయితీలు వంటి ఎన్నో సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది.

దీంతో ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. అదే సమయంలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్‌లోనూ పెట్టుబడులకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు. విభజన వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది మండలాలు, గ్రామాలే. ఎందుకంటే ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. హైటెక్‌సిటీ నిర్మించక ముందు ఇక్కడ చ.గ. రూ.250గా ఉండేది. కానీ ఇప్పుడక్కడ చ.గ. రూ.40 వేల నుంచి లక్ష వరకూ ఉందంటే ఎంతలా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ జైవీర్ రెడ్డి మాట్లాడుతూ.. ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాల్లోని మధ్య తరగతి ప్రజలు కూడా హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనేందుకు ఇష్టపడుతున్నారన్నారు.

ధరలు చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. విద్య, వైద్యం, జీవన భృతి వంటి అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండటం, ఓఆర్‌ఆర్, మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి అదనపు సౌకర్యాలని వివరించారు. రూ.1.75 కోట్ల పెట్టుబడితో నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షోలో 150 మంది డెవలపర్లు వంద స్టాళ్లలో 200లకు పైగా ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలు.. ఇలా నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని విభాగాల వారూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.  జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్ అధినేత రవీందర్‌రెడ్డి, గిరిధారి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి, పీబీఈఎల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
  ముఖ్య అతిథులు ఆలస్యం కారణంగా ప్రాపర్టీ షో ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలో క్రెడాయ్ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రాపర్టీ షో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. పొన్నాల లక్ష్మయ్య మినహా ఆహ్వాన పత్రికలో ఉన్న ముఖ్య అతిథులెవ్వరూ హాజరుకాలేదు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మంత్రులు మహీధర్‌రెడ్డి, ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు గైర్హాజరయ్యారు. మంత్రి దానం నాగేందర్ కార్యక్రమం ప్రారంభం కాకముందే వచ్చి వెళ్లారు.

మరిన్ని వార్తలు