మార్కెట్లోకి హ్యుందాయ్‌ ‘గ్రాండ్‌ ఐ10 నియోస్‌’

21 Aug, 2019 10:13 IST|Sakshi

ధరల శ్రేణి రూ. 4.99లక్షలు –7.99 లక్షలు

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌).. తాజాగా తన కాంపాక్ట్‌ సెగ్మెంట్‌ పోర్ట్‌ ఫోలియోలో ‘గ్రాండ్‌ ఐ10 నియోస్‌’ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇందులో పెట్రోల్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.4.99 లక్షలు (ఎక్స్‌షోరూం) కాగా, హైఎండ్‌ కారు ధర రూ.7.14 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. డీజిల్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.4.99 లక్షలుగానూ, టాప్‌ఎండ్‌ ధర రూ.7.99 లక్షలుగా నిర్ణయించింది. నూతన వేరియంట్లలో 1.2 డీజిల్, పెట్రోల్‌ ఇంజిన్లను అమర్చింది. మోడల్‌ ఆధారంగా ప్రతి లీటరుకు 20.7 నుంచి 26.2 కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నట్లు వివరించింది. ఈ సందర్భంగా హెచ్‌ఎంఐఎల్‌ ఎండీ, సీఈఓ ఎస్‌ఎస్‌ కిమ్‌ మాట్లాడుతూ.. ‘నూతన మోడల్‌ అంతర్జాతీయ మార్కెట్లో మేడిన్‌ ఇండియా ఉత్పత్తిగా లభిస్తుంది. భారత్‌లో అమ్ముడయ్యే ప్యాసింజర్‌ వాహనాల్లో (కాంపాక్ట్‌ విభాగం) 50 శాతానికి మించి వాటాను ఐ10 కలిగి ఉంది. వచ్చే ఐదేళ్లలో కూడా ఈ మోడల్‌దే హవాగా కొనసాగనుంది. నియోస్‌ విడుదలతో 19.4 శాతంగా ఉన్న ప్రస్తుత కంపెనీ మార్కెట్‌ వాటా మరింత పెరగనుందని భావిస్తున్నాం’ అని అన్నారు.

జీఎస్‌టీ తగ్గితేపరిశ్రమ గాడినపడుతుంది
వాహనాలపై వస్తు సేవల పన్ను రేట్లను ప్రభుత్వం తగ్గిస్తే ఆటో పరిశ్రమకు ఇది సానుకూల అంశంగా మారుతుందని  హెచ్‌ఎంఐఎల్‌ ఎండీ, సీఈఓ ఎస్‌ఎస్‌ కిమ్‌ అన్నారు. అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న పరిశ్రమకు జీఎస్‌టీ తగ్గింపు ఊతమిస్తుంది. రానున్నది పండుగల సీజన్‌ కావడం చేత ఈ సమయంలోనే ప్రభుత్వం రేట్లను తగ్గించడం అనేది సరైన నిర్ణయంగా ఉంటుందని విశ్లేషించారు. పండుగల సమయంలో కొనుగోళ్లు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రేట్ల కోతకు ఇదే మంచి సమయమని చెప్పారాయన. ప్రభుత్వ నిర్ణయమే ఇప్పుడు పరిశ్రమను గాడిలో పడేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘వాహన రుణాలకు రుణ లభ్యత తగ్గిపోవడం, బీఎస్‌–6 అమలు, పెరిగిన బీమా ధరలు, వినియోగదారుల సెంటిమెంట్‌ దెబ్బతినడం వంటి ప్రతికూలతల్లో పరిశ్రమ ఇబ్బందుల్లో పడిపోయింది. అయితే,  త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని భావిస్తున్నా. ఇందుకు తగిన నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంది’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు