హ్యుందాయ్‌ ‘కోనా’ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ

10 Jul, 2019 11:50 IST|Sakshi
ధర రూ.25.3 లక్షలు

9.7 సెకన్లలో 0–100 కి.మీ వేగం

ఒక్కసారి చార్జింగ్‌తో 452 కి.మీ ప్రయాణం

కారుతో పాటు హోమ్‌ చార్జింగ్‌ కిట్‌

ఇండియన్‌ ఆయిల్‌తో కలిసి స్టేషన్ల ఏర్పాటు..

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌).. భారత ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్లో సంచలనం సృష్టించింది. మంగళవారం తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ)ని ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘కోనా’ పేరుతో విడుదలైన ఈ కారు ధర రూ.25.3 లక్షలుగా ప్రకటించింది. కేవలం 9.7 సెకన్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగిన ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ.. గరిష్టంగా 154 కి.మీటర్ల వేగంతో, ఒక్కసారి చార్జ్‌ చేస్తే 452 కి.మీ దూరం వరకు ప్రయాణించగలదు. కారుతో పాటు హోమ్‌ చార్జింగ్‌ కిట్‌ వస్తోంది. ఇందులోని 50కిలోవాట్‌ వేగవంతమైన చార్జర్‌ సహాయంతో కేవలం 57 నిమిషాల్లోనే బ్యాటరీ సున్నా నుంచి 80 శాతం చార్జ్‌ అవుతుంది.

స్టాండర్డ్‌ 7.2 కిలోవాట్‌ చార్జర్‌తో అయితే ఆరు గంటల సమయం పడుతుందని కంపెనీ వివరించింది. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడం కోసం ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీతో జట్టుకట్టినట్లు ప్రకటించింది. చెన్నైలోని హ్యుందాయ్‌ ప్లాంట్‌లో అసెంబుల్‌ అయిన ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే.. ఆరు ఎయిర్‌ బ్యాగులు, యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌–ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్, మార్గదర్శకాలతో కూడిన వెనుక కెమెరా ఉన్నాయి. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ, ఎండీ ఎస్‌ ఎస్‌ కిమ్‌ మాట్లాడుతూ.. ‘చార్జింగ్‌ సమస్యల కారణంగా తొలుత ఈ కారును దేశంలోని 11 నగరాల్లో విడుదలచేస్తున్నాం. కేవలం వాణిజ్య వాహనాలకు మాత్రమే పరిమితం కాకుండా.. వ్యక్తిగతంగా ఉపయోగించే ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీ)లకు కూడా ఫేమ్‌ 2 పథకం ద్వారా ప్రయోజనాలను అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 44 పర్యావరణ అనుకూల మోడళ్లను విడుదలచేయాలనేది మాతృసంస్థ లక్ష్యం కాగా, వీటిలో 23 పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ కార్లు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.

సామాన్యుడి ఈవీల నిమిత్తం హైదరాబాద్‌లో పరిశోధన
కొరియా, హైదరాబాద్‌ ప్రత్యేక బృందాలు కలిసి సామాన్యుడు వినియోగించే ఎలక్ట్రిక్‌ కార్ల పరిశోధన, అభివృద్ధిపై దృష్టిసారించినట్లు కంపెనీ ప్రకటించింది. వచ్చే రెండు నుంచి మూడేళ్లలో మాస్‌ మార్కెట్లో కంపెనీ పట్టుపెరిగే దిశగా ఈ బృందాలు పనిచేస్తున్నట్లు ఎస్‌ ఎస్‌ కిమ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు