హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ కార్లు!!

29 Jun, 2018 00:11 IST|Sakshi

వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో మార్కెట్‌లోకి..  

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘హ్యుందాయ్‌’... తాజాగా భారత్‌లో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. చెన్నై ప్లాంటులో వీటిని తయారు చేయాలని భావిస్తోంది. మరోవైపు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) 2021 తొలి త్రైమాసికానికల్లా కోటి కార్లు విక్రయించాలని లకి‡్ష్యంచుకుంది. 2018–20 మధ్య కాలంలో ఎనిమిది కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించాలని భావిస్తున్న హెచ్‌ఎంఐఎల్‌.. తన వార్షిక తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలని చూస్తోంది.

ప్రస్తుత 7 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని వచ్చే ఏడాది జనవరి నాటికి 7.5 లక్షల యూనిట్లకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ‘మేం తేవాలని భావిస్తున్న 8 ఉత్పత్తుల్లో ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కూడా ఒకటి. 2019 రెండో అర్ధభాగంలో దీన్ని ఆవిష్కరించే అవకాశముంది. తొలి దశలో దీన్ని కంప్లీట్‌ నాక్‌డ్‌ డౌన్‌ యూనిట్‌ రూపంలో దిగుమతి చేసుకుంటాం’ అని హెచ్‌ఎంఐఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో వై.కె.కో తెలిపారు.

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు (ఈవీ) కేంద్ర ప్రభుత్వం అందించే మద్దతు, మార్కెట్‌ స్పందన ఆధారంగా చెన్నైలోని ప్లాంటులో ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేస్తామని పేర్కొన్నారు. భారత్‌లోని 15 పట్టణాల్లో ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని ఆవిష్కరిస్తామని, దీని ధర నిర్ణయించాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు