అడుగులు వేసే కారు!

8 Jan, 2019 22:07 IST|Sakshi

లాస్‌వెగాస్‌: కారు చక్రల మీద రయ్యిమంటూ దూసుకెళ్లకుండా, అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ వెళితే ఎలా ఉంటుంది? కేవలం హాలీవుడ్‌ సినిమాల్లోనే ఇది సాధ్యమవుతుందనుకుంటున్నారా? అయితే ఇంకొన్నేళ్లలో ఇది అక్షరాలా నిజం కానుంది. ఈదిశగా ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండయ్‌ ముందడుగు వేసింది. ఏటా వినూత్న వాహనాల ప్రదర్శన జరిగే సీఈఎస్‌–2019లో హ్యుండయ్‌ ఈ కార్ల గురించి వివరించింది. ఈ నడిచే కార్ల సహాయంతో కష్టసాధ్యమైన మార్గాల్లోనూ సులభంగా ప్రయాణించవచ్చని హ్యుండయ్‌ క్రెడిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ స్యూ తెలిపారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. ఎత్తైన ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికీ ఈ కార్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన చెబుతున్నారు. 5 అడుగుల ఎత్తయిన గోడలను సైతం ఎక్కేలా వీటిని రూపొందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ కార్లు మార్కెట్లోకి రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

మరిన్ని వార్తలు