ఆర్‌బీఐ గవర్నర్‌ గిరీపై రాజన్‌ పుస్తకం

24 Aug, 2017 00:15 IST|Sakshi
ఆర్‌బీఐ గవర్నర్‌ గిరీపై రాజన్‌ పుస్తకం

సెప్టెంబర్‌ 4న మార్కెట్లోకి ’ఐ డూ వాట్‌ ఐ డూ’
న్యూఢిల్లీ: సంక్షోభ సమయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రఘురామ్‌ రాజన్‌.. కొత్తగా మరో పుస్తకాన్ని ప్రచురించారు. ’ఐ డూ వాట్‌ ఐ డూ’ పేరిట ఆయన రాసిన ఈ పుస్తకం సెప్టెంబర్‌ 4న మార్కెట్లోకి రానుంది. ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన కాలంలో రాజన్‌ రాసిన వ్యాసాలు, ప్రసంగాలు ఇందులో పొందుపర్చారు. ఆర్థిక, రాజకీయపరమైన అంశాలు దీన్లో చాలా ఉన్నాయి. 2013 సెప్టెంబర్‌లో రాజన్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి రూపాయి పతనావస్థలో ఉండగా.. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది.

కరుగుతున్న విదేశీ మారక నిల్వలు.. భారీ కరెంటు అకౌంటు లోటు దేశానికి సమస్యాత్మకంగా మారాయి. అయిదు బలహీన ఎకానమీల్లో ఒకటనే ముద్రతో భారత్‌పై నమ్మకం సడలిన పరిస్థితులను రాజన్‌ సమర్థంగా ఎదుర్కొన్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత... కొనసాగుతున్న సంస్కరణల గురించి ప్రపంచానికి బలమైన సంకేతాలు పంపారని ముద్రణా సంస్థ హార్పర్‌కోలిన్స్‌ ఇండియా పేర్కొంది.

 దీర్ఘకాలికంగా వృద్ధి, స్థిరత్వాన్ని సాధించడం, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలపై రాజన్‌ దృష్టి పెట్టారని తెలిపింది.  దోశ ధరతో ముడిపెట్టి ఆర్థికాంశాలను రాజన్‌ వివరించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ‘దోశనామిక్స్‌ లేదా రుణ సంక్షోభ పరిష్కారమార్గాలు కావొచ్చు. రాజన్‌ ఆర్థిక విషయాలను సరళంగా వివరిస్తారు‘ అని హార్పర్‌కోలిన్స్‌ వివరించింది. రాజన్‌ ఇప్పటికే సేవింగ్‌ క్యాపిటలిజం ఫ్రం క్యాపిటలిస్ట్‌తో పాటు మరో పుస్తకాన్ని కూడా రాశారు.

మరిన్ని వార్తలు