ప్రేమ జంట మధ్య చిచ్చుపెట్టిన ‘నీరవ్‌ మోదీ’

8 Oct, 2018 18:07 IST|Sakshi

న్యూఢిల్లీ : నీరవ్‌ మోదీ.. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి, చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేసిన ఘనుడు. ఇతన్ని పట్టుకోవడానికి సీబీఐ, ఈడీ బృందాలు తెగ ప్రయత్నిస్తున్నాయి. కానీ అతను ఎక్కడున్నాడో తెలియదు. నీరవ్‌కు వ్యతిరేకంగా ఇంటర్‌పోల్‌ అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ అయి ఉంది. భారత్‌ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్న ఇతను, ఓ ప్రేమ జంట మధ్య చిక్కు రేపాడట. కెనడాకు చెందిన ఓ వ్యక్తికి, ఈ డైమండ్‌ కింగ్ నకిలీ డైమండ్‌ రింగులను అమ్మాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడం కోసం డైమండ్‌ రింగ్‌లను ఆర్డర్‌ చేసిన కెనడా పౌరుడికి, నకిలీవి అంటగట్టాడు. కానీ అవి నకిలీవని, అది కూడా నీరవ్‌ మోదీ నుంచి కొన్నవని తెలియడంతో, గర్ల్‌ఫ్రెండ్‌ ఆ వ్యక్తికి బ్రేకప్‌ చెప్పేసింది. దీంతో తీవ్ర డిప్రెషన్‌లోకి కుంగిపోయాడు ఆ కెనడా వ్యక్తి.   

వివరాల్లోకి వెళ్తే... 
అల్ఫోన్సో 2012లో ఓ ఈవెంట్‌లో నీరవ్‌ మోదీని కలిశాడు. ఆ తర్వాత ఇద్దరికి మంచి బంధం ఏర్పడింది. అల్ఫోన్సో పేమెంట్‌ ప్రాసెసింగ్‌ కంపెనీకి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌. అల్ఫోన్సో తాను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రియురాలికి డైమండ్‌ రింగ్‌ ఇచ్చి, ప్రపోజ్‌ చేసి, ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవాలని అనుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత అంటే ‌2018 ఏప్రిల్‌లో లక్ష డాలర్ల బడ్జెట్‌లో ‘స్పెషల్‌ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌’ పంపించాలని నీరవ్‌ మోదీకి ఈమెయిల్‌ చేశాడు. కానీ అప్పటికే నీరవ్‌ మోదీ-పీఎన్‌బీ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. కానీ ఈ వ్యక్తికి ఈ స్కాం గురించి తెలియలేదు. ఇదే అదునుగా చూసుకుని, నీరవ్‌ మోదీ ‘పర్‌ఫెక్ట్‌’ 3.2 క్యారెట్ గుండ్రటి కట్‌ డైమాండ్‌ రింగ్‌ను అల్ఫోన్సోకు పంపించాడు. హై-క్వాలిటీ గ్రేడ్‌, కలర్‌లెస్‌ స్టోన్‌తో ఉన్న దాని ఖరీదు లక్షా 20వేల డాలర్లుగా పేర్కొన్నాడు. 

నీరవ్‌ మోదీ తనకు కావాల్సిన రింగ్‌ పంపడంతో, వెంటనే అల్ఫోన్సో ఆనంద భరితుడై కృతజ్ఞతలతో మెసేజ్‌ పంపాడు. కానీ తన గర్ల్‌ఫ్రెండ్‌ మరో డిజైన్‌ కోరుకోవడంతో, మరో డైమాండ్‌ రింగ్‌ను కూడా 80వేల డాలర్లకు నీరవ్‌ నుంచే తెప్పించుకున్నాడు. ఈ రింగ్‌లను మోదీ అసిస్టెంట్‌ అరీ, అల్ఫోన్సోకు అందించాడు. ఆ డైమండ్‌ రింగ్‌ల నగదును నీరవ్‌ హాంకాంగ్‌ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేశాడు అ‍ల్ఫోన్సో. ఆ తర్వాత డైమండ్‌ రింగ్‌ల ఇన్‌వాయిస్‌, అధికారి సర్టిఫికేట్లను పంపించమని ఎన్నిసార్లు అడిగినా నీరవ్‌ పంపించలేదు. నీరవ్‌ పంపించిన రెండు రింగ్‌లతో గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేశాడు. ఆమె అంగీకరించింది కూడా. కానీ రింగ్‌ల సర్టిఫికేట్లు లేకపోతే, ప్రమాదంలో పడతామని అనుకున్న, అదే విషయంపై చాలా సార్లు మోదీకి ఈమెయిల్స్‌ పంపారు. సర్టిఫికేట్లు వస్తున్నాయంటూ నీరవ్ నమ్మబలికాడు. కానీ ఎంతకీ అవి రాలేదు. అ‍ల్ఫోన్సో ప్రియురాలు ఈ రింగ్‌లను తీసుకెళ్లి డైమండ్‌ విలువను లెక్కగట్టే వారికి చూపించింది. వారు అవి నకిలీ డైమండ్స్‌ అని తేల్చేశారు. 

అదే విషయం ప్రియురాలు, అ‍ల్ఫోన్సోకు చెప్పడంతో, అలా జరగదని, వాటి కోసం రెండు లక్షల డాలర్లు ఖర్చు చేశానని, ఇవి నీరవ్‌ పంపించాడంటూ చెప్పుకొచ్చాడు. విషయం తెలియడంతో, అల్ఫోన్సో ప్రియురాలు అతనికి బ్రేకప్‌ చెప్పింది. దీంతో మానిసకంగా కుంగిపోయిన అల్ఫోన్సో మోదీకి కోపంతో మరో ఈమెయిల్‌ చేశాడు. ‘నాకు ఎలాంటి బాధను ఇచ్చావో నీకేమైనా తెలుస్తుందా. నా ప్రియురాలు ఇప్పుడు మాజీ ప్రియురాలు అయింది. మా అ‍ద్భుతమైన క్షణాన్ని నాశనం చేశావు. నా జీవితాన్ని నాశనం చేశావు’ అంటూ ఈమెయిల్‌ పంపాడు. ఇదే విషయంపై అల్ఫోన్సో, మోదీకి వ్యతిరేకంగా సివిల్‌ దావా వేశాడు. 4.2 మిలియన్‌ డాలర్లు చెల్లించాలంటూ డిమాండ్‌ చేశాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ కేసు విచారణకు రానుంది. 

మరిన్ని వార్తలు