ప్రింట్‌ మీడియాకు గుడ్‌ న్యూస్‌ 

9 Jan, 2019 10:05 IST|Sakshi

ప్రకటన రేట్లు 25శాతం పెంపు

ఓడిపోతామన్న భయంతో ఇదో ఎత్తుగడ- కాంగ్రెస్‌

సాక్షి న్యూఢిల్లీ: చిన్న,మధ్య వ్యాపార పత్రికలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వ్యాపార పత్రికలకు జారీ చేసే ప్రకటనల రేట్లను 25శాతం పెంచింది. ప్రింట్ మీడియాలో ప్రకటన రేట్లు సవరిస్తూ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. 8 వ రేట్ స్ట్రక్చర్ కమిటీ సిఫార్సులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సవరించిన రేట్లు మంగళవారం నుంచి మూడు సంవత్సరాల పాటు అమల్లో వుంటాయని ప్రకటించింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్‌  కమ్యూనికేషన్  ఒక ప్రకటన జారీ చేసింది.  అంతర్జాతీయంగా న్యూస్‌ ప్రింట్‌, ప్రాసెసింగ్‌ చార్జీలు, ఇతర కారణాల రీత్యా ఈ పెంపును చేసినట్టు  వెల్లడించింది. 

ప్రభుత్వ నిర్ణయం ముఖ్యంగా ప్రాంతీయ మరియు స్థానిక భాషలలోని చిన్నపత్రికలకు ప్రయోజనకరంగా ఉంటుందని పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఈ నిర్ణయంపై  విమర‍్శలు గుప్పించింది.  రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓడిపోతామన్న భయంతో పాలక పార్టీ  బీజేపీ వేసిన మరొక ఎత్తుగడగా పేర్కొంది. డబ్బుతో మీడియాను నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది  ఆరోపించారు.

కాగా గత ఎన్నికల సందర్భంగా 2013లో వ్యాపార ప్రకటనల రేట్లు పెరిగాయి. 2010 నాటి నుంచి 19 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు ప్రింట్‌ మీడియా ప్రకటనల రేట్లను ప్రభుత్వం 25శాతం పెంచడంతో హెచ్‌టీ మీడియా, జీ, జాగ్రన్‌ ప్రకాశన్‌, డిబీ కార్పొ తదితర  మీడియా షేర్లు  ఇవాల్టి(జనవరి 9)  మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా