మైండ్‌స్పేస్‌కు ఐజీబీసీ గుర్తింపు

31 Mar, 2018 00:22 IST|Sakshi

నగరంలో గోల్డ్‌ రేటింగ్‌ పొందిన తొలి వాణిజ్య ప్రాంగణమిదే

సాక్షి, హైదరాబాద్‌ :  ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కే రహేజా కార్ప్‌కు చెందిన మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్‌ కమర్షియల్‌ బిజినెస్‌ పార్క్‌కు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) గుర్తింపు దక్కింది. నగరంలో గోల్డ్‌ రేటింగ్‌ సర్టిఫికెట్‌ దక్కించుకున్న తొలి వాణిజ్య ప్రాంగణమిదే. దేశ వ్యాప్తంగా అయితే 11వ ప్రాపర్టీ. ‘‘ప్రాంగణ ప్రణాళిక, నీరు, ఇంధన సామర్థ్యం, పర్యావరణం, నాణ్యత, ఆవిష్కరణలు ఇతరత్రా అంశాలపై 54 పాయింట్లను దక్కించుకుందని’’ కే రహేజా కార్ప్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షబ్బీర్‌ కాంచ్‌వాలా ఒక ప్రకటనలో తెలిపారు.

మైండ్‌స్పేస్‌లో 3,500 చెట్లు..
మైండ్‌ స్పేస్‌ ప్రాంతం 110 ఎకరాల్లో ఉంది. ఇందులో 21 శాతం స్థలం ల్యాండ్‌ స్కేప్‌ కోసం కేటాయించారు. మొత్తం 3,500 చెట్లున్నాయి. కోటి చ.అ. బిల్టప్‌ ఏరియాలోని వాణిజ్య ప్రాంతంలో 21 వాణిజ్య భవనాలు, 80 వేలకు పైగా నివాసితులున్నారు. 100 శాతం రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్, మురుగు నీటి శుద్ధి కేంద్రం, ఆన్‌సైట్‌లో 1.47 మెగావాట్లు, ఆఫ్‌సైట్‌లో 2 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఏర్పాట్లు వంటివి ఉన్నాయి.

45.50 మి.చ.అ.ల్లో గ్రీన్‌ ప్రాజెక్ట్‌లు..
ఇప్పటికే కే రహేజా కార్ప్‌ దేశంలోని పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో 45.50 మిలియన్‌ చ.అ.ల్లో యూఎస్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (యూఎస్‌జీబీసీ) అందించే లీడర్‌షిప్‌ ఇన్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డిజైన్‌ (ఎల్‌ఈఈడీ), ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) గుర్తింపు పొందిన నివాస, వాణిజ్య, ఆతిథ్య భవనాలను నిర్మించింది. వీటిల్లో 29 కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లు ఎల్‌ఈఈడీ గోల్డ్‌ రేటింగ్‌ పొందగా.. 6 ప్రాజెక్ట్‌లు ప్రీ–సర్టిఫికెట్‌ పొందాయి. ఐజీబీసీ నుంచి 7 నివాస ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందగా.. 4 ప్రాజెక్ట్‌లు ప్రీ–సర్టిఫికెట్‌ పొందాయి.

మరిన్ని వార్తలు