ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాలు మళ్లీ మదింపు

12 Feb, 2019 01:13 IST|Sakshi

ప్రక్రియ చేపట్టనున్న ఐసీఏఐ విభాగం

ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల మేరకు నిర్ణయం

ఆడిటర్ల అభ్యంతరాలు

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) మరోసారి మదింపు చేయనుంది. ఈ కేసులో ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఐసీఏఐ అకౌంటింగ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ విభాగం దీన్ని చేపట్టనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. 2012–13 నుంచి 2017–18 మధ్య కాలానికి సంబంధించి కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 130 కింద (ఆర్థిక అవకతవకలు) ఐఎల్‌ఎఫ్‌ఎస్, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌ ఖాతాలను, ఆర్థిక ఫలితాలను మరోసారి మదింపు చేయాలంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్‌ జనవరి 1న ఆదేశించడం తెలిసిందే. వీటికి అనుగుణంగానే ఐసీఏఐ తాజాగా ప్రక్రియ చేపట్టనుంది. పాత మేనేజ్‌మెంట్‌ హయాంలో పద్దుల్లో అవకతవకలు జరిగాయని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో), ఐసీఏఐ గత నివేదికల్లో సూచనప్రాయంగా వెల్లడించటం తెలిసిందే. ఖాతాల్ని మరోసారి మదించటానికి ఆర్‌బీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థలు అనుమతించినా.. ఆయా పద్దులు, ఆర్థిక ఫలితాలు కంపెనీ రూపొందించినవేనని, తమకు సంబంధం లేదని ఎస్‌ఆర్‌బీసీ అండ్‌ కో తదితర ఆడిటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ దాదాపు రూ.90,000 కోట్ల మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు బాకీపడింది. 

22 సంస్థలపై ఆంక్షల తొలగింపు
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో కాస్త మెరుగ్గా ఉన్న 22 కంపెనీలు రుణాలపై వడ్డీల చెల్లింపును కొనసాగించేందుకు నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) అనుమతించింది. అలాగే గ్రూప్‌ దివాలా పరిష్కార ప్రక్రియ పర్యవేక్షణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ డీకే జైన్‌ నియామకాన్ని కూడా ఆమోదిస్తూ జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య బెంచి నిర్ణయం తీసుకుంది. అటు విదేశాల్లో ఏర్పాటైన 133 సంస్థలపైనా మారటోరియం ఎత్తివేసి, దివాలా పరిష్కార ప్రక్రియలో భాగం అయ్యేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ రుణ పరిష్కార ప్రణాళికను కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ గత నెలలో సమర్పించింది. దీని ప్రకారం.. ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్న కంపెనీలను ఆకుపచ్చ రంగులోనూ, కొంత తీవ్రత ఉన్న వాటిని కాషాయ రంగు, తీవ్రంగా ఉన్న వాటిని ఎరుపు రంగులోనూ వర్గీకరించింది. ఎరుపు వర్ణంలోనివి కనీసం సీనియర్‌ సెక్యూర్డ్‌ రుణదాతలకు కూడా చెల్లింపులు జరపలేని పరిస్థితుల్లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు