చందా కొచర్‌కు మరిన్ని చిక్కులు

14 Jan, 2020 10:38 IST|Sakshi
చందా కొచర్‌ (ఫైల్‌ ఫోటో)

చందా కొచర్‌పై బాంబే హైకోర్టుకు ఐసీఐసీఐ

బోనస్‌ను రికవరీ చేయండి - ఐసీఐసీఐ

సాక్షి,ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్‌ కుంభకోణంలో ఐసీఐసీఐ బ్యాంకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈస్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎండీ చందా కొచర్‌ నుంచి తామిచ్చిన బోనస్‌ను రికవరీ చేయాలని కోరింది. అలాగే తన తొలగింపు అ​క్రమమంటూ  చందా కొచర్‌ గత ఏడాది  దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. తన తొలగింపు ద్వారా ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొనడం, బ్యాంకు విలువైన స్టాక్‌ ఆప్షన్‌ను పొందేందుకు, తప్పు దారి పట్టించే ప్రయత్నమని ఐసీఐసీఐ బ్యాంకు తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ మేరకు జనవరి 10 న దావా వేసింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20​కి వాయిదా పడింది.

ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీగా ఆమెను తొలగించిన తరువాత ఏప్రిల్ 2006- మార్చి 2018 వరకు ఆమెకిచ్చిన  బోనస్‌ క్లాబ్యాక్‌ చేయాలని కోరుతోంది. (క్లాబ్యాక్ అంటే ఏదైనా దుష్ప్రవర్తన లేదా క్షీణించిన లాభాల విషయంలో ఒక ఉద్యోగి నుండి బోనస్ తదితర ప్రోత్సాహక-ఆధారిత వేతనాన్ని కంపెనీ తిరిగి తీసుకోవచ్చు)  బ్యాంకు వ్యాపార ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి బ్యాంకుతోపాటు వాటాదారులందరికీ తీవ్రమైన ఇబ్బందిని కలిగించిందనీ,  బ్యాంకుకు ప్రతిష్టకు తీరని నష్టం కలిగిందని ఆరోపించింది.  తన భర్త దీపక్ కొచర్‌కు లబ్ధి చేకూర‍్చడం కోసమే వీడియోకాన్ గ్రూపునకు రూ .2,250 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్‌ పాత్ర ఉందని  బ్యాంకు ఆరోపించింది.

కాగా  చందా కొచర్‌ తన పదవీకాంలో వీడియోకాన్‌కు క్విడ్ ప్రో కో ద్వారా  చట్టవిరుద్ధంగా రూ.3250 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. అయితే మొదట్లో చందా కొచర్‌కు బాసటగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్  బోర్డు జస్టిస్ (రిటైర్డ్) బిఎన్ శ్రీకృష్ణ కమిటీని 2019 జనవరిలో ఏర్పాటు చేసింది. ఈ కమిటి నివేదిక ఆధారంగా ఆమెను పదవినుంచి తొలగించడంతోపాటు ఏప్రిల్ 2009- మార్చి 2018 మధ్య ఆమెకు చెల్లించిన అన్ని బోనస్,  స్టాక్ ఆప్షన్లను తిరిగి తీసుకోవాలని బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. మరోవైపు తన తొలగింపు చట్టవిరుద్ధమని పేర్కొంటూ బ్యాంకు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ (నవంబర్ 30, 2019న)చందా కొచర్‌  బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా