సీబీఐ దూకుడు: చందా కొచర్‌కు మరో షాక్‌

5 Apr, 2018 18:40 IST|Sakshi

సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ గ్రూపు‌ రుణ వివాదంలో సీబీఐ చురుకుగా కదులుతోంది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందాకొచర్‌ భర్త, దీపక్‌ కొచర్‌ సోదరుడు రాజీవ్‌  కొచర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకున్నారు. ముంబై  విమానాశ్రయంనుంచి సింగపూర్‌ వెళుతుండగా అతనిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  కాగా ఈ కేసులో చందాకొచర్‌ కుటుంబానికి  చెందిన సన్నిహితుడిని సీబీఐ ప్రశ్నించడం ఇదే మొదటిసారి.  ఈ నేపథ్యంలో మరింత విచారణ చేపట్టే క్రమంలో రాజీవ్‌ను అదుపులోకి తీసుకుంది. అతణ్నించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు  ప్రయత్నిస్తోంది. 

ఇప్పటికే ఈ కేసులో చందాకొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ధూత్‌పై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ,అనేక పత్రాలను స్వాధీనం చేసుకుంది.  అయితే ఇంతవర​కూ  దీపక్‌ను ప్రశ్నించలేదు. కానీ, దీపక్‌ కొచర్‌కుచెందిన న్యూపవర్‌రెన్యువబుల్స్‌ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. కాగా 2012లో వీడియోకాన్ గ్రూపునకు రూ.3,250 కోట్ల విలువైన రుణాల మంజూరు సందర్భంగా బ్యాంకు సీఈవో చందా కొచర్‌పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే  ఐసీఐసీఐ బ్యాంకు  బోర్డు ఈ ఆరోపణలను ఖండించింది. అలాగే ఈ  కేసులో స్వతంత్ర దర్యాప్తును వ్యతిరేకించింది.

కాగా ఈ రుణ వివాదంలోకి తాజాగా దీపక్‌ సోదరుడు, చందా కొచర్‌ మరిది.. రాజీవ్‌ కొచర్‌కి చెందిన అవిస్టా సంస్థ కూడా చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రుణాలు పొందిన పలు కంపెనీలకు అవిస్టా రుణ పునర్‌వ్యవస్థీకరణ సేవలు అందించిందనీ,  అవిస్టా సేవలు పొందిన  వాటిల్లో  జైప్రకాశ్‌ అసోసియేట్స్, జైప్రకాశ్‌ పవర్‌లతో పాటు వీడియోకాన్, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సుజ్లాన్‌ తదితర కంపెనీలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని రాజీవ్‌ కొచర్‌ ఖండించిన సంగతి తెలిసిందే. భారతీయ బ్యాంకులతో  ఎలాంటి సిండికేషన్‌ ఉండకూడదనే ఒక నియమాన్ని తాము పెట్టుకున్నామన్నారు.  ఈక్రమంలో చందా కొచర్‌ సీఈవోగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఇండోనేషియా, దుబాయ్‌లోని కార్యాలయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా  వ్యాపారం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదేదో కావాలని చేస్తున్న దుష్ప్రచారంగా  రాజీవ్‌ కొచర్‌  కొట్టిపారేశారు. 

మరిన్ని వార్తలు