కొచర్‌ సెలవుపై రగడ.. వివరణ ఇచ్చిన బ్యాంక్‌

2 Jun, 2018 00:56 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ప్రయివేటు బ్యాంక్‌ ఐసీఐసీఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌(సీఈఓ) చందా కొచర్‌ను స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యేవరకు సెలవు మీద వెళ్లాల్సిందిగా బ్యాంక్‌ బోర్డు ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ కథనాలను బ్యాంక్‌ బోర్డు తోసిపుచ్చింది. ‘ఇండిపెండెంట్‌ బోర్డు విచారణ పూర్తయ్యేంతవరకు కొచర్‌ను సెలవు మీద వెళ్లాల్సిందిగా మేం కోరినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. ఆమె వార్షిక సెలవులో ఉన్నారు.

ముందుగా ప్లాన్‌ చేసుకున్న ప్రకారమే కొచర్‌ సెలవు తీసుకున్నారు. అంతేకానీ ఇందులో ఎలాంటి బలవంతం లేదు’ అని బ్యాంక్‌ బోర్డు పేర్కొంది. చందా కొచర్‌ వారసులను ఎంపిక చేసేందుకు ఎలాంటి సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేయలేదని కూడా స్పష్టం చేసింది. కాగా వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణ మంజూరీ విషయంలో చందా కొచర్‌ క్విడ్‌ ప్రో కో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొచర్‌పై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని బ్యాంకు బోర్డు ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు